మనకు మళ్లీ నిరాశే!

0
14

ఈ బడ్జెట్‌లోనైనా ఎయిమ్స్ వస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. బీజేపీ పాలిత రాష్ర్టాలైన గుజరాత్, జార్ఖండ్‌లలో మాత్రం ఎయిమ్స్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థికమంత్రి జైట్లీ ప్రకటించారు. తెలంగాణకు కూడా ఈ సంవత్సరమే ఎయిమ్స్‌ను తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చిన జైట్లీ దాన్ని నిలబెట్టుకోలేదు. రాష్ర్టాలకు నిధులు, ప్రాజెక్టులకు సంబంధించి స్పష్టమైన ప్రకటనలు చేయలేదు. తెలంగాణకు సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు గురించి కూడా జైట్లీ హామీ ఇచ్చినా బడ్జెట్‌లో మాత్రం నిర్దిష్టంగా నిధుల కేటాయింపు ప్రస్తావన లేదు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని రెండేండ్లుగా విజ్ఞప్తి చేస్తున్నది. ఇదే విషయమై సీఎం కేసీఆర్ గతంలో లేఖ కూడా రాశారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు సైతం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను, ఆర్థిక మంత్రి జైట్లీని కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ బడ్జెట్‌లో ప్రకటన లేకపోవడంతో ఎంపీ జితేందర్‌రెడ్డి వెంటనే జైట్లీని ఆయన చాంబర్‌లో కలిశారు.

బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణకు ఎయిమ్స్ ఇవ్వడంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం నిరాశ కలిగించిందని, హామీ ఇచ్చినా గాలికొదిలేశారని ప్రశ్నించారు. దీనికి జైట్లీ బదులిస్తూ, బడ్జెట్‌లో పేర్కొనకపోయినా ఈ ఆర్థిక సంవత్సరంలోనే తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నిధుల విషయంలో ఇబ్బంది ఏర్పడడంతో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయనున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణను చేర్చలేకపోయామని జైట్లీ వివరించారని చెప్పారు. బడ్జెట్ సమావేశాల అనంతరం తప్పకుండా ఐదారు నెలల్లోనే తెలంగాణలో ఎయిమ్స్‌కు సంబంధించి ప్రకటన చేస్తామని జైట్లీ తెలిపారని పేర్కొన్నారు. ఇక సిరిసిల్ల మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌కు సంబంధించి దేశంలో చాలా చోట్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపు జరిగిందని, జౌళి మంత్రిత్వశాఖతో మాట్లాడి తెలంగాణ అవసరాన్ని నెరవేర్చుకుంటామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here