మత్తు డొంక పెద్దదే!

0
24

తెలంగాణ:తెలుగు సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల వాడకం కలకలం రేపుతున్నది. గురువారం ఎనిమిదిమంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. తాజాగా హీరో రవితేజ కారుడ్రైవర్ శ్రీనివాసరావుతోపాటు ముగ్గురు నటులకు నోటీసులు జారీచేశారు. డ్రగ్స్ మాఫియా డాన్ కెల్విన్‌తో సినీరంగంలో పలువురు ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఇందుకు తమవద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో తీగ లాగుతున్న అధికారులు.. పెద్ద డొంకలనే కదిలించబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మరో పది రోజుల్లో పలువురు సినీ ప్రముఖుల అరెస్టుకు రంగం సిద్ధంచేస్తున్నారని సమాచారం. మాదకద్రవ్యాల మైకంలో తూలుతున్న ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. పలువురు ముఖ్యమైన నటులకు, సాంకేతిక సిబ్బందికి నోటీసులు అందాయన్న వార్తలతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా నివ్వెరబోయింది. ఈ వ్యవహారంలో మరెన్ని పెద్ద తలకాయలు ఉన్నాయోనన్న ఊహాగానాలు సాగుతున్నాయి. నోటీసులు అందుకున్నవారు 19వ తేదీ నుంచి విచారణ ఎదుర్కొనబోతున్నారు. వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో తేదీని కేటాయించారని సమాచారం. హీరోయిన్లను మాత్రం వారి నివాసాల్లో లేదా వారు సూచించిన స్థలంలో విచారించేందుకు సిట్ సంసిద్ధత వ్యక్తంచేసినట్టు తెలుస్తున్నది. అయితే పేర్లు బయటకు వచ్చిన కొంతమంది మాత్రం ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని తెగేసి చెప్తున్నారు. కలవరానికి గురవుతున్న మరికొందరు విచారణకు ఎలా హాజరుకావాలి? ఆ సమయంలో పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలి? అనే విషయాల్లో న్యాయ సలహాలు తీసుకుంటున్నారని సమాచారం.

తెలుగు సినీరంగంలో ఒక ప్రముఖ దర్శకుడికి డ్రగ్స్ ముఠా ప్రధాన నిందితుడు కెల్విన్ ముఠాతో గట్టి సంబంధాలున్నాయని చెప్పేందుకు బలమైన ఆధారాలు ఎైక్సెజ్ విచారణ విభాగం సిట్ వద్ద ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ప్రముఖ దర్శకుడు ఎంతమందికి డ్రగ్స్ సరఫరా చేశాడు? పరిశ్రమలో డ్రగ్స్ ఏ మోతాదులో వాడుతున్నారు? కెల్విన్‌ద్వారా అందరికీ డ్రగ్స్ ఎలా అందేవి? అనే పూర్తి వివరాలు సిట్ వద్ద ఉన్నట్టు తెలుస్తున్నది. కెల్విన్ మొబైల్ కాల్ డాటాతోపాటు అందులో రికార్డయిన సంభాషణలు, వాట్సప్ మేసెజ్‌లు, వీడియో కాల్స్‌తోపాటు పలు వీడియోలు, ఫొటోలువంటి బలమైన ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. వీటి ఆధారంగా సదరు ప్రముఖ దర్శకుడిని, ఇతర నటులను డ్రగ్స్ వాడకంలో దింపిన కీలక వ్యక్తులను త్వరలోనే అరెస్టుచేసే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీచేసిన సిట్ అధికారులు.. విచారణలో వారు ఇచ్చే స్టేట్‌మెంట్ల ఆధారంగా దర్యాప్తును ముందుకు నడిపిస్తారని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే మరిన్ని ఆధారాల కోసం కెల్విన్‌ను కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here