మడులకు దుంకిన మంజీర

0
19

గత ఏడాది వానాకాలంలో కురిసిన భారీ వర్షాలతో మంజీర ఉప్పొంగడంతో ప్రధాన ప్రాజెక్టులైన సింగూరు, నిజాంసాగర్ నిండుకుండల్లా మారాయి. దీంతో మూడేండ్లుగా ఎడారిని తలపించిన నిజాంసాగర్ కింద పూర్తి ఆయకట్టు యాసంగిలో సాగులోకి వచ్చింది. రాజధాని దాహార్తిని తీర్చేందుకే పరిమితమైన సింగూరు నుంచి తొలిసారి సాగుకు నీళ్లిచ్చారు. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్లంపల్లి నుంచి గోదావరి నీటిని తీసుకొచ్చి హైదరాబాద్‌కు తాగునీళ్లించింది. దీంతో సింగూరు నీటిని పూర్తిగా సాగుకు వినియోగిస్తున్నారు. రెండు ప్రాజెక్టుల కింద మెజారిటీ ఆయకట్టులో వరినాట్లు పూర్తయ్యాయి.

చరిత్రలో తొలిసారి సాగుకు నీళ్లు

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో సింగూరు ప్రాజెక్టును 29.9 టీఎంసీల సామర్థ్యంతో 40 వేల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో 1998లో నిర్మించారు. కానీ సమైక్యరాష్ట్రంలో ఈ ప్రాజెక్టులో నీటిని నిల్వచేసి హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసమే వినియోగించారు. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతులు వర్షాధార పంటలే సాగుచేసుకున్నారు. నీటి సౌకర్యం లేని రైతులు పట్నానికి వలసపోయి కూలీలుగా మారారు. స్వరాష్ట్రంలో గోదావరి నీటితో పట్నం దాహార్తి తీర్చడంతో తొలిసారిగా ఈ యాసంగిలో ఆయకట్టు రైతులు సాగు కు సిద్ధమయ్యారు. 18 ఏండ్ల తర్వాత వలసపోయిన రైతులు తిరిగొచ్చి వరినాట్లు మొదలుపెట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌రావు చొరవతో అన్ని కాల్వలకు మరమ్మతులు చేయించారు. దీంతో యాసంగిలో 30 వేల ఎకరాలకు నీరందించేలా అధికారులు ఏర్పాట్లుచేశారు. సంగారెడ్డి జిల్లాలో 2,517 చెరువులు, కుంటలు వర్షాలతో నిండడంతో పాటు, మరికొన్నింటిని సింగూరు నీటితో నింపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here