భూమి కోసం ఎస్‌బీఐ, ఐవోసీ ఎల్‌ సహా పలు సంస్థల వినతులు

0
22

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కార్పొరేట్‌ కార్యాలయాలు నిర్మించుకునేందుకు మరిన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక్క విద్యా రంగంలోనే ఇప్పటిదాకా సుమారు రూ.24 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు సుముఖత చూపాయి. విట్‌, ఎస్‌ఆర్‌ఎం లాంటి విశ్వవిద్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు కూడా జరిగాయి. వైద్య రంగంలోను పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ తమకు కేటాయించిన భూమిలో వైద్య విశ్వవిద్యాలయం, ఇతర యూనిట్ల కోసం సుమారు 15.6 లక్షల చదరపు అడుగుల భవనాలను నిర్మించనుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), భారత ఆహార సంస్థ (ఎఫ్‌బీఐ), భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్‌), ఇండియన ఆయిల్‌ కార్పొరేషన లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌)లు తమ తమ కార్యాలయాల కోసం భూములు అడిగాయి. వీటితో పాటు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం, నందమూరి బసవతారకం కేన్సర్‌ ఫౌండేషన, ఆప్కాబ్‌, ఏపీఎ్‌సఎ్‌ఫసీ తదితర సంస్థలు కూడా కోరుతున్నాయి. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో భారీ ప్రాంగణంలో ఉంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ సంస్థకు భూ కేటాయింపు చేశారు. అక్కడ భారీ భవనాలు నిర్మించారు. ఇప్పుడు అమరావతిలోనూ 25 ఎకరాల భూమి కోసం ఆ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం 10ఎకరాలు వరకు ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో సుమారు 5లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపడతారు. ఆడిటోరియంలు, ధ్యానమందిరాలు, తరగతి గదులు, భోజనశాలలు, ఆడియో, వీడియో శిక్షణ గదులు, పరిపాలనా భవనం ఇలాంటివన్నీ నిర్మిస్తారు. వీరికి ఎకరా రూ.4.1 కోట్ల విలువ కట్టి..దానిపై లీజు నిర్ణయించి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. లీజు నామమాత్రంగా ఉండాలని మంత్రుల బృందం సిఫారసు చేసింది. భూ కేటాయింపు చేస్తే దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ఎక్కువ భాగంలో పచ్చదనం నింపుతామని సదరు సంస్థ ప్రతిపాదించింది. ప్రభుత్వ నిర్మాణాలకు తోడు.. ఇలా పెద్దఎత్తున ఆసక్తి చూపుతున్న సంస్థలన్నీ నిర్మాణాలను చేపడితే ఇక్కడ భారీగా ఆర్థిక కార్యకలాపాలు జరిగే అవకాశాలున్నాయి. కాగా.. రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్‌డీఏ ఒక్కో గ్రామానికి రూ.25 లక్షల చొప్పున కేటాయించింది. వీటికి మ్యాచింగ్‌ గ్రాంట్‌గా కేంద్రం ఒక్కో గ్రామానికి మరో రూ.25 లక్షల చొప్పున ఇస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here