బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది.

0
25

తెలంగాణ ఖేల్ ప్రతినిధి: ఈ ఏడాది అద్భుత ఫామ్‌తో దూసుకెళుతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. బీడబ్ల్యూఎఫ్ తాజా ర్యాంకింగ్స్‌లో సింధు ఏకంగా నాలుగుస్థానాలు మెరుగుపరచుకొని 6వ ర్యాంకులో నిలిచింది. సింధు కెరీర్‌లో ఇదే బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం. గతంలో అత్యుత్తమంగా ప్రపంచ ఎనిమిదోర్యాంకులో నిలిచిన 21ఏండ్ల సింధు ఈ సీజన్ ముగింపు టోర్నమెంట్ అయిన ప్రతిష్ఠాత్మక దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సెమీఫైనల్ చేరడంతో ర్యాంకు మెరుగైంది. ఇక గాయంతో సతమతమవుతూ ఫామ్ కోల్పోయిన సైనా నెహ్వాల్ ఓ స్థానం కోల్పోయి 10వ ర్యాంకులో నిలిచింది. దీంతో భారత్ తరఫున సింధు నంబర్‌వన్ ర్యాంకర్‌గా నిలిచింది. ఈ ఏడాది రియో ఒలింపిక్స్‌లో రజతపతకం సాధించిన సింధు, ఆ తర్వాత చైనా ఓపెన్‌తో కెరీర్‌లో తొలి సూపర్‌సిరీస్ టైటిల్ అందుకోవడంతో పాటు హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 15, ప్రణయ్ 28, సౌరభ్ వర్మ 46వ ర్యాంకుల్లో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో సుమిత్ రెడ్డి/మను అత్రి జోడీకి 21వ ర్యాంకు దక్కగా, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి/అశ్వినీ పొన్నప్ప జంట ఓస్థానం మెరుగుపరచుకొని 11వ ర్యాంకులో నిలిచింది. మిక్స్‌డ్‌లో సిక్కి/ప్రణవ్ జోడీ 16వ ర్యాం కును అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here