బీసీ, ఎస్టీ కమిషన్ల నివేదికలకు క్యాబినెట్ ఆమోదం

0
20

ప్రజల అభీష్టం మేరకు అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రైతుల రుణమాఫీ మొత్తం పూర్తికావడం, రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమైన రోజుగా ఆయన అభివర్ణించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టీలకు, ముస్లింలకు (బీసీ-ఈ) 12 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చామన్న సీఎం.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రిజర్వేషన్ పెంపుదలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచడం అసాధ్యమన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఆయన రాష్ట్రాల పేర్లు, అక్కడ అమలవుతున్న రిజర్వేషన్ శాతాలతో సహా వివరించారు. తమిళనాడులో అనుసరిస్తున్న విధానాన్ని ప్రస్తావించిన సీఎం.. ఆ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగానే 69% రిజర్వేషన్ అమల్లో ఉందని, అదే పద్ధతుల్లో తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచి తీరుతామని స్పష్టంచేశారు. ఒకవేళ కేంద్రం నిరాకరిస్తే సుప్రీంకోర్టుకు వెళుతామని సీఎం ప్రకటించారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్‌లో జరిగింది. అనంతరం సమావేశ వివరాలను డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చందూలాల్, జోగు రామన్నతో కలిసి ముఖ్యమంత్రి స్వయంగా మీడియాకు వివరించారు.

LEAVE A REPLY