బతికించిన స్పిన్‌ మంత్రం!

0
22

‘బ్యాటింగ్‌ వైఫల్యమే దెబ్బతీసింది. చెప్పుకోదగ్గ భాగస్వామ్యాలే లేవు. ఘోరంగా బ్యాటింగ్‌ చేశాం. ఇంకా చెప్పాలంటే బ్యాటింగ్‌ ఎలా చేయకూడదో అలా చేశాం’- తొలిటెస్టులో ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్న అనంతరం టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ అన్నమాటలివి. ఈ సందర్భంగా కోహ్లీ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యాన్ని ఎత్తిచూపాడు తప్ప బౌలర్లను నిందించలేదు. బౌలర్లపై అతడు ఉంచిన నమ్మకాన్ని వారు వమ్ము చేయలేదు. ఫలితమే రెండో టెస్టులో టీమ్‌ ఇండియా విజయం. ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వస్తోందంటే ఆ జట్టును అందరూ తక్కువ అంచనా వేశారు. టీమ్‌ ఇండియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తుందని అన్నవారూ లేకపోలేదు. జట్టుపై నమ్మకమో.. లేక అతి విశ్వాసమో.. వారిని అలా అనేలా చేసి ఉండవచ్చు. కానీ, తొలి టెస్ట్‌ ఫలితం అందుకు భిన్నంగా వచ్చింది. కోహ్లీసేన 333 పరుగుల తేడాతో భారీ అపజయాన్ని మూటగట్టుకుంది.

వరుస సిరీస్‌ విజయాలతో దూకుడు మీదున్న టీమ్‌ ఇండియాకు మాత్రమే కాదు, సగటు క్రికెట్‌ అభిమానికి సైతం మింగుడుపడని వార్త ఇది. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా జరిగిన రెండో టెస్టుపైనే ఇరు జట్లు ఆశలు పెట్టుకున్నాయి. రెండో టెస్టు గెలిచి ఆధిక్యంలోకి వెళ్లాలని ఆసీస్‌ ఉవ్విళ్లూరగా, ఈ టెస్టు గెలవడం ద్వారా సిరీస్‌ సమం చేయాలని కోహ్లీసేన భావించింది. తొలి ఇన్నింగ్స్‌ పూర్తయిన తర్వాత సగటు భారత్‌ క్రికెట్‌ అభిమాని ఆశలు గల్లంతయ్యాయి. 189 పరుగులకే టీమ్‌ ఇండియా చాప చుట్టేసింది. నాథన్‌ లైయాన్‌ ఎనిమిది వికెట్లతో భారత బ్యాటింగ్‌ పతనాన్ని శాసించాడు. దీంతో మరోసారి భారత బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం తేటతెల్లమైంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోలేపోవడంతో భారమంతా మరోసారి బౌలర్లపైనే పడింది. మరోవైపు భారత్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైన పిచ్‌పై ఆసీస్‌ ఆటగాళ్లు స్థిరంగా ఆడారు. పరుగుల సంగతి పక్కన పెట్టి క్రీజులో పాతకుపోయారు. బ్యాటింగ్‌ అత్యంత కష్టంగా మారిన పిచ్‌పై అసాధారణ పట్టుదల, నైపుణ్యం ప్రదర్శించారు. అయితే, ఈ దశలో భారత బౌలర్లు తమ శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. ఎట్టకేలకు ఆస్ట్రేలియాను 274 పరుగులకు కట్టడి చేశారు. అప్పటికీ ఆస్టేలియాదే పైచేయి అయింది.

ఈ దశలో టీమ్‌ ఇండియా టెస్టు గెలుస్తుందని ఎవరూ వూహించి ఉండరు. ఎందుకంటే భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించే సమయానికి ఆసీస్‌ 87 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్‌ను పతనాన్ని శాసించిన నాథన్‌ లైయాన్‌తో పాటు, ఒకీఫ్‌ వంటి బౌలర్లు ఉన్న ఆసీస్‌ జట్టుకు విజయం సులభమే అనుకున్నారంతా. కానీ సరైన సమయంలో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించారు. ఒత్తిడి తట్టుకొని నిలబడ్డారు. ముఖ్యంగా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, ఛతేశ్వర్‌ పుజారా, రహానె సమయోచిత బ్యాటింగ్‌తో ఆసీస్‌ బౌలర్ల విజృంభణకు అడ్డుకట్ట వేశారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి విఫలమైన వేళ.. ఛతేశ్వర్‌ పుజారా, రహానెతో కలిసి అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ప్రస్తుత సిరీస్‌లో ఇరు జట్లలోనూ వీరిదే అత్యధిక భాగస్వామ్య రికార్డు. నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమ్‌ ఇండియాకు తొలి సెషన్‌ కీలకంగా మారింది. 213/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత జట్టు లంచ్‌ విరామానికి సుమారు 60 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. ఈ సారి బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకునే బాధ్యత ఆసీస్‌ బౌలర్‌ హేజిల్‌వుడ్‌ తీసుకున్నాడు. ఆరు వికెట్లు తీయడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 274 పరుగులకు తెరపడింది.

నమ్మకం నిలబెట్టిన బౌలర్లు
ఇంకా రోజున్నర ఆట మిగిలి ఉంది. ఆస్ట్రేలియా లక్ష్యం 188 పరుగులు. పది వికెట్లు చేతిలో ఉన్నాయి. భారత గడ్డపై రాణిస్తున్న ఆస్ట్రేలియాకు విజయం తథ్యమని అందరూ భావించారు. కానీ బౌలర్లు టీమ్‌ ఇండియా పరువు నిలబెట్టారు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను 112 పరుగులకు ఆలౌట్‌ చేసి తమ సత్తా చాటారు. రెండో టెస్టు సందర్భంగా బౌలర్ల ఎంపికలో కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. రవీంద్ర జడేజాకు బంతి ఇవ్వకుండా చేశాడనేది అతనిపై ఆరోపణ. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌తో ఎక్కువ, జడేజాతో తక్కువ ఓవర్లు వేయించాడు. అయితే జడేజా ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లోనైనా బౌలింగ్‌ విషయంలో కోహ్లీ నిర్ణయాన్ని మార్చుకుంటాడని అనుకున్నారు అందరూ. కానీ మళ్లీ అతడు అశ్విన్‌నే నమ్ముకున్నాడు. కోహ్లీ తనపై ఉంచిన నమ్మకాన్ని అశ్విన్‌ వమ్ము చేయలేదు. నాలుగోరోజు బ్యాటింగ్‌కు పిచ్‌ సైతం సహకరించని వేళ భారత్‌ బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారు. అశ్విన్‌ ఆరు వికెట్లు తీసి మరోసారి తన సత్తా చాటాడు. ఫలితం టీమ్‌ ఇండియా 75 పరుగులతో విజయం. సిరీస్‌ను 1-1తో సమం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here