ప్లాన్ ఎ విఫలమైతే.. ప్లాన్ బి

0
31

లోధా సంస్కరణల అమలుపై బీసీసీఐ వ్యతిరేకత
న్యూఢిల్లీ: జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదనల అమలుపై బీసీసీఐ వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తున్నది. ఈనెల 5న సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు దాకా వేచి చూడాలని భావిస్తున్నది. శుక్రవారం ముంబైలో జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో కూడా సంస్కరణల అమలుపై తుది నిర్ణయానికి రాలేకపోయింది. ఒకవేళ సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే ప్లాన్-బిని సిద్ధంగా ఉంచుకోవాలని అన్ని రాష్ర్టాల సంఘాలకు సూచించినట్లు బోర్డు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీసీసీఐ పాలక వర్గాన్ని పూర్తిగా తొలగించేందుకు కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిైళ్లెని పరిశీలకుడిగా పంపాలని లోధా కమిటీ ఆదేశించిన నేపథ్యంలో బోర్డు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలని సీనియర్ సభ్యులు చెప్పారు.

ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే ఆ మేరకు రాజ్యాంగంలో మార్పులు చేసుకొని దానికి కట్టుబడి ఉండాలని అన్ని సంఘాలకు సూచించాం అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే లోధా సిఫారసులను అమలు చేస్తామని ప్రకటించిన త్రిపుర, విదర్భ సంఘాలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. మా సభ్యుల అభిప్రాయాలు మరో రకంగా ఉన్నాయి. విదర్భ, త్రిపురకు పరిస్థితి గురించి వివరించాం. కొన్ని ప్రతిపాదనలనే మేం వ్యతిరేకిస్తున్నామని చెప్పాం. ఏదేమైనా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తాం అని షిర్కే వ్యాఖ్యానించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here