ప్రో కబడ్డీలో పాక్ ఆటగాళ్లను ఆడనివ్వం

0
16

వచ్చేనెలలో మొదలయ్యే ప్రో కబడ్డీలో పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆడేందుకు అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఆపేంతవరకు పాక్‌తో ఎలాంటి క్రీడాసంబంధాలు పెంపొందించుకోవాలని అనుకోవడం లేదని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ సోమవారం కుండబద్దలు కొట్టారు. ఐదో సీజన్ ప్రో కబడ్డీ వచ్చేనెల 25నుంచి జరుగనుంది. అయితే సోమవారం నుంచి వరుసగా రెండురోజుల పాటు జరిగే ప్రోకబడ్డీ ఆటగాళ్ల వేలంలో ఇప్పటికే పాకిస్థాన్ ఆటగాళ్లను నిర్వాహకులు అనుమతించారు. ఈ నేపథ్యంలో తాజాగా క్రీడామంత్రి చేసిన వ్యాఖ్యలతో సదరు ఆటగాళ్ల పరిస్థితి ఏంటన్నదానిపై నిర్వాహకులు సందిగ్ధంలో పడ్డారు.

ఇదే విషయమై మంత్రి గోయెల్‌ను అడిగితే.. వాళ్లు (నిర్వాహకులు) పాక్ ఆటగాళ్లను పిలుచుకోనివ్వండి. కానీ, లీగ్‌లో ఆడేందుకు మాత్రం అవకాశమివ్వం. ఒకవేళ సదరు ఫ్రాంచైజీలు ఇప్పటికే ఆటగాళ్లను ఎంపికచేసుకున్నా కూడా, వాళ్లను ఆడించాలా వద్దా అన్నదానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఆపేంతవరకు ఆ దేశంతో ఆటలు అసాధ్యం అని మంత్రి గోయెల్ పేర్కొన్నారు. ఇప్పటికే పాక్ క్రికెటర్లు, హాకీ క్రీడాకారులను భారత్‌లో జరిగే పలు టోర్నీలకు అనుమతించని సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here