ప్రొఫెసర్ సాయిబాబాకు యావజ్జీవం

0
45

నిషేధిత మావోయిస్టులతో సంబంధాలు కలిగిఉండి, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, మరో నలుగురికి మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. ఇదే కేసులో మరొకరికి పదేండ్ల జైలు శిక్ష పడింది. సాయిబాబాతోపాటు జేఎన్‌యూ విద్యార్థి హేం మిశ్రా, పాత్రికేయుడు ప్రశాంత్ రాహితోపాటు మహేశ్ టిర్కే, పాండు నరోత్‌కు యావజ్జీవ ఖైదు, కొరియర్‌గా పనిచేశాడన్న అభియోగాలపై విజయ్ టిర్కేకు పదేండ్ల కఠిన కారాగార శిక్ష పడింది. తీవ్ర అనారోగ్యంతో దాదాపు 90శాతం శరీరం పనిచేయని స్థితిలో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా.. ప్రస్తుతం వీల్‌చెయిర్‌కు పరిమితమై ఉన్నారు. కోర్టు తీర్పు వెలువడిన సమయంలో సాయిబాబా, మరో ఐదుగురు కూడా కోర్టుకు హాజరయ్యా రు. ఈ ఐదుగురికీ చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టంలోని 13, 18, 20, 38, 39 సెక్షన్ల కింద యావజ్జీవ ఖైదు విధిస్తూ గడ్చిరోలి కోర్టు న్యాయమూర్తి ఎస్‌ఎస్ షిండే శిక్ష విధించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలో సభ్యులుగా ఉన్నారని, ఆ సంస్థ కార్యకలాపాలకు మద్దతు పలుకుతున్నారని, రిక్రూట్‌మెంట్‌కు సహకరిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విచారణలో కోర్టు గుర్తించింది. నిషేధిత మావోయిస్టులకు బహిరంగ కార్యకర్తగా ప్రొఫెసర్ పనిచేస్తున్నారని, మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఒక సంఘాన్ని కూడా నిర్వహిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here