ప్రాజెక్టులపై కేసుల పాపం విపక్షాలదే

0
15

ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తమ ఉనికి కనుమరుగవుతుందన్న భయంతోనే ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి, ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. ఈ కేసులన్నీ వేసింది.. వేయించిందీ టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలేనని, వాటిని వాదిస్తున్నదని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత బీ నరసింహారెడ్డి కూతురు రచనారెడ్డి, సిరిసిల్లలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి అని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రాజెక్టులపై విష ప్రచారంచేస్తున్నారని శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తుందని, కోటి ఎకరాల మాగాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

భక్త రామదాసు ప్రాజెక్టును ఏడాదిలోపే పూర్తిచేయడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి, నిజాయితీకి నిదర్శనమన్నారు. 123 నంబర్ జీవో ద్వారా భూసేకరణ జరిగినందువల్లే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తయిందన్నారు. విపక్షాలు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఐదు పిల్స్, డిండి, కాళేశ్వరంలపై ఒక్కో పిల్‌లతోపాటు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు జారీచేసిన 123 నంబర్ జీవోకు వ్యతిరేకంగా 28 పిటిషన్లు దాఖలు చేశాయన్నారు. ఎన్జీటీలోనూ రెండు కేసులు ఉన్నాయన్నారు. మల్లన్నసాగర్‌పై మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా సన్నిహితులు సీహెచ్ రాజిరెడ్డి, హయాతుద్దీన్, జానార్దన్‌తోపాటు ఒక సీపీఎం కార్యకర్త పిటిషన్ వేశారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here