ప్రధానిని కలిసిన రాహుల్‌ సంచలనం రేపిన ఇరువురి భేటీ

0
28

ప్రధాని మోదీ అవినీతిపరుడని, పార్లమెంటులో మాట్లాడే అవకాశమిస్తే ఆయన వ్యక్తిగత అవినీతికి సంబంధించిన ఆధారాలు బయటపెడతానని, సభలో భూకంపం సృష్టిస్తానని సవాళ్లు విసిరిన రాహుల్‌గాంధీ శుక్రవారం ప్రజలందర్నీ ఆశ్చర్యపరిచారు. ఉదయం పార్లమెంటు సమావేశాలకు ముందు ఆయన మోదీతో భేటీ అయ్యారు. రాహుల్‌ వెంట మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, రాజ్‌ బబ్బర్‌ తదితర ముఖ్యనేతలు వచ్చారు. త్వరలో ఎన్నికలను ఎదుర్కొంటున్న పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత అమరీందర్‌సింగ్‌ విజ్ఞప్తి మేరకు గురువారమే రాహుల్‌ ప్రధాని అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. శుక్రవారం భేటీ సందర్భంగా దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రైతు రుణమాఫీ ప్రకటించాలని, వ్యవసాయానికి విద్యుత చార్జీలు సగానికి సగం తగ్గించాలని, కనీస మద్దతు ధరలు రైతుకు లాభదాయకంగా ఉండేట్లు పెంచాలంటూ వినతిపత్రం సమర్పించారు. వారు చెప్పిందంతా ప్రధాని శ్రద్ధగా విని, తరచూ కలుసుకుందామని బదులిచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ప్రధాని అంగీకరించారని, అయితే, తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని రాహుల్‌ బయటకు వచ్చాక విలేకరులకు తెలిపారు. భూకంపం సృష్టించేంత భయంకర రహస్యం రాహుల్‌ చేతిలో ఉంటే మోదీని ఎందుకు కలుస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2012లో బిర్లా కంపెనీపై ఐటీ దాడులు జరిగినపుడు ఆ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న ఈ-మెయిల్స్‌లో అప్పటి గుజరాత సీఎంగా ఉన్న మోదీకి డబ్బు ఇచ్చినట్లుగా ఎంట్రీలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని కేజ్రీవాల్‌, ప్రశాంత భూషణ్‌ ప్రస్తావించారు. రాహుల్‌కూడా వీటిని ఉద్దేశించే ‘భూకంపం’ సృష్టిస్తానన్నారనే వాదన ఉంది. అయితే, ఈ-మెయిల్‌ ఆధారంగా జాబితాలోని వ్యక్తులపై విచారణ చేపట్టలేమని ఇప్పటికే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here