ప్రతిపక్షాలతో కలవం.. ధర్నాలు చేయం: వైసీపీ ఎంపీలు

0
23

పెద్ద నోట్ల రద్దుకు తాము వ్యతిరేకం కాదని, నోట్ల మార్పిడి అమలు తీరును మాత్రమే తప్పుబడుతున్నామని వైసీపీ ఎంపీలు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ధర్నాలు, నిరసనల్లో తాము పాలుపంచుకోబోమని తేల్చిచెప్పారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహనరెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, మిథునరెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి గురువారం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఒక్కసారిగా 86 శాతం నగదును రద్దు చేసినప్పుడు సరైన పద్ధతుల్లో ప్రజలకు అవసరమైనంత నగదును సిద్ధం చేయాల్సింది. నిర్ణీత గడువు విధించి నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఉంటే ప్రజలకు ఇబ్బందులు తప్పేవి. ప్రకటన చేసిన నాటి నుంచి ఆ గడువు లోపు జరిగే అన్ని క్రయ, విక్రయాలపైనా ఐటీ శాఖ కన్ను వేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండేది కాదు’ అని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోట్ల రద్దు విషయం ముందే తెలుసని, ఆయన జాగ్రత్తపడ్డారని ఆరోపించారు. ఢిల్లీలో ప్రధాని మోదీని ప్రశంసిస్తూ.. ఏపీలో మాత్రం విమర్శిస్తున్నారన్నారు. వాస్తవానికి ప్రత్యేక హోదాపై ఈ సమావేశాల్లో పోరాడాలని తాము తీర్మానించుకున్నా.. పెద్దనోట్ల రద్దు కారణంగా దానిని పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు. ఈ నెల 28వ తేదీన ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్‌పై పార్టీ అధ్యక్షుడు జగన్‌ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు

LEAVE A REPLY