పెద్దనోట్ల రద్దుపై ఆందోళనలు.. పలుచోట్ల బంద్

0
19

పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు సోమవారం ఇచ్చిన జన్ ఆక్రోష్ దివస్ పిలుపునకు మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు రాష్ర్టాల్లో బీజేపీయేతర పార్టీల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో జరిగిన ఆందోళనల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వామపక్ష పార్టీలు బంద్‌కు పిలుపునివ్వగా, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఆందోళనలకు పరిమితమయ్యాయి. బంద్ ప్రభావం ఒకటి రెండు రాష్ర్టాల్లోమినహా పెద్దగా కనిపించలేదు. ఆందోళనకారులు పలుచోట్ల రైల్‌రోకో నిర్వహించగా, మరికొన్ని చోట్ల రోడ్లపై బైఠాయించారు.
వామపక్ష పార్టీలు ఇచ్చిన జన్ ఆక్రోష్ దివస్ ప్రశాంతంగా ముగిసింది. వామపక్షాల బంద్ పిలుపు కారణంగా కేరళ, త్రిపుర,బీహార్, ఒడిశా రాష్ర్టాలు ప్రభావితమయ్యాయి. పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ర్టాల్లో బంద్‌కు నామమాత్రపు స్పందన లభించింది. ఒడిశా సహా పలు రాష్ర్టాల్లో విద్యా సంస్థలను మూసివేశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 20 రోజులుగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారంటూ కాంగ్రెస్, వామపక్షాలు జన్ ఆక్రోష్ దివస్‌ను పాటించాలని పిలుపునిచ్చాయి. దేశంలోని పలు నగరాలు, పట్టణాల్లో సోమవారం ఉదయం నుంచే నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. పలు చోట్ల ఆందోళనకారులు రైల్‌రోకో నిర్వహించగా, మరికొన్ని చోట్ల రోడ్లపై బైఠాయించారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో మండీహౌస్ నుంచి జంతర్‌మంతర్ వరకు, రైసినా రోడ్డు నుంచి పార్లమెంట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అయితే పోలీసులు ఆందోళనకారులను ముందుకు సాగనీయలేదు.

LEAVE A REPLY