పీఏను తొలగించాలని బాలకృష్ణకు బాబు సూచన

0
34
హిందూపురం టీడీపీలో రేగిన సంక్షోభం ఓ కొలుక్కి వస్తోంది. పిఏ కనుమూరి శేఖర్‌ నాయుడుపై ఎమ్మెల్యే బాలకృష్ణ వేటు వేశారు. మరోవైపు సీఎం చంద్రబాబుతో బాలయ్య భేటి అయ్యారు. ఈ అంశంపై చర్చించారు. పీఏను తొలగించాలని బాలకృష్ణకు చంద్రబాబు సూచించినట్లుగా తెలియవచ్చింది. నిమ్మకూరు అభివృద్ధి కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఎన్టీఆర్ జీవితంలోని అన్ని కోణాలు సినిమాలో చూపించాలని, ఎన్టీఆర్ సన్నిహితులు, సమకాలీకులతో చర్చించాలని బాలయ్యకు చంద్రబాబు సూచించినట్లు తెలియవచ్చింది.ఈ భేటీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా పాల్గొన్నారు.
రెండున్నరేళ్లుగా బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న శేఖర్ షాడో ఎమ్మెల్యేగా మారి బాలకృష్ణతో నిమిత్తం లేకుండా నియోజకవర్గంలో పెత్తనం చెలాయించారు. బాలయ్య నియోజకవర్గానికి వచ్చినా బిజీగా గడిపి పార్టీ శ్రేణులతో మాట్లాడకుండానే వెనుదిరగడం పరిపాటిగా మారింది. మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు, సీనియర్ నేత అంబికా లక్ష్మీనారాయణ వంటి వారిని లెక్క చేయకుండా శేఖర్ ప్రవర్తించినట్టు విమర్శలున్నాయి. నియోజకవర్గంలో ఎవరికీ ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యేకు చెప్పుకునే అవకాశం లేకపోగా పీఏకు చెప్పే సాహసం చేసేవారు కాదు. పీఏ శేఖర్ ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేశారని విమర్శలున్నాయి. దీంతో నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరకు వేగుల ద్వారా విషయం తెలుసుకున్న బాలయ్య శేఖర్‌ను విధుల నుంచి తొలగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here