పీఎన్‌బీ కుంభకోణంపై మోదీ

0
8

దేశాన్ని కుదిపేస్తున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణంపై ప్రధాని  మోదీ తొలిసారి పెదవి విప్పారు. నీరవ్, పీఎన్‌బీల పేర్లను ప్రస్తావించకుండా మోదీ మాట్లాడారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడే వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇలాంటి కుంభకోణాలను గుర్తించేందుకు ఆర్థిక సంస్థలు, వాటి పర్యవేక్షక విభాగాలు∙శ్రద్ధతో పనిచేయాలన్నారు.

ఆంగ్ల దినపత్రిక ఎకనమిక్‌ టైమ్స్‌ నిర్వహించిన ప్రపంచ వాణిజ్య సదస్సులో శుక్రవారం మోదీ మాట్లాడారు. ‘ఆర్థిక అవకతవకలపై మా ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటోందనీ, ఇకపై కూడా అలాగే వ్యవహరిస్తామని నేను స్పష్టంచేస్తున్నాను’ అని అన్నారు. 2011 నుంచి 2017 మధ్య నీరవ్‌ మోదీ బ్యాంకు అధికారులతో కుమ్మక్కై అక్రమంగా ఎల్‌వోయూలు జారీ చేయించుకుని బ్యాంకును రూ.11,400 కోట్లకు మోసగించడం తెలిసిందే.

‘నిబంధనలు, విధానాలను రూపొందించేవారు తమ పనిని జాగ్రత్తగా చేయాలని నేను కోరుతున్నాను’ అని మోదీ అన్నారు. జీఎస్టీ వల్ల పన్ను ఆదాయం పెరిగిందనీ, గతంలో 60 లక్షల మంది పన్నులు కడుతుండగా ఇప్పుడు ఆ సంఖ్య కోటికి చేరిందని ఆయన అన్నారు. ఆర్థిక లోటు, ద్రవ్య లోటుల్లో తగ్గుదల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక తదితరాలే భారత వృద్ధి గురించి చెబుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత వాటా 3.1 శాతానికి పెరిగిందనీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో 21 శాతం భారత్‌దేనని మోదీ వెల్లడించారు.

LEAVE A REPLY