పిల్లల చదువు కోసం ఖైదీలకు రుణాలు

0
15

ఖైదీల పిల్లల చదువు నిమిత్తం ఒక్కో ఖైదీకి రూ. 20 నుంచి రూ.30వేల వరకు రుణాలను అందజేస్తున్నామని, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 200 మంది ఖైదీలకు రుణాలను ఇచ్చామని జైళ్ల శాఖ ఇన్‌చార్జి ఐజీ నర్సింహ్మ తెలిపారు. ఖైదీలు శిక్షలను అనుభవిస్తున్న నేపథ్యంలో వారి పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట మున్సిఫ్ కోర్టు ఆవరణలో ఉన్న జైలును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జైళ్లలో పని చేయడం ద్వారా వచ్చే డబ్బులతో ఆయా రుణాలను చెల్లించాలన్నారు. జైళ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.130 కోట్లను ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని కొన్ని జైళ్లను మూసివేయాలన్న ఆలోచనలో ఉన్నామని, వీటి స్థానాల్లో కళాశాలలు, పాఠశాలలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ, వరంగల్ కారాగారాలను తరలించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదని పేర్కొన్నారు. సమావేశంలో జోగిపేట సబ్‌జైలు సూపరింటెండెంట్ అచ్చయ్య పాల్గొన్నారు.

LEAVE A REPLY