పింఛను భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు

0
28

చందా పింఛను పథకం(సీపీఎస్‌)ను రద్దు చేయించడానికి దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తామని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. గురువారమిక్కడ జంతర్‌మంతర్‌ వద్ద సీపీఎస్‌ను వ్యతిరేకిస్తూ 29 రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సహా అన్ని విపక్ష పార్టీలు పింఛను నూతన విధానాన్ని ఉపసంహరించుకొనేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలభారత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు లీలావత్‌ డిమాండు చేశారు. అశోక్‌బాబు మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లోనూ పాత పింఛను విధానం అమలు చేయాలని కోరారు. దీని వల్ల రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. పాత పింఛను అమలు కోసం రాజీలేని పోరాటం చేస్తామని అశోక్‌బాబు స్పష్టం చేశారు.

ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతను కాలరాస్తున్న సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేయాలని అఖిల భారత సెకండరీ టీచర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు కత్తి నర్సింహారెడ్డి డిమాండు చేశారు. సీపీఎస్‌ రద్దు కోసం రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. జాతీయ నాయకులతో సమన్వయం చేసి అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఒకేరోజున లక్షలాదిమందితో మహాధర్నా నిర్వహించనున్నామని తెలిపారు. అఖిల భారత ఉద్యోగ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో చంద్రశేఖర్‌రెడ్డి, విద్యాసాగర్‌, ఇ.షణ్మూర్ధి, గంటా మోహన్‌, కుమారస్వామి, తదితర ఏపీకి చెందిన వేలాది మంది ఉద్యోగులు హాజరయ్యారు. ‘‘పింఛను భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు’’ అనే ప్లకార్డులు ప్రదర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here