పాతబస్తీకి 4వేల కోట్లు, మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతాం

0
25

హైదరాబాద్ పాత నగరంలో రూ. 4000 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. దీనికోసం హైదరాబాద్ ఎంపీ, ప్రజాప్రతినిధులతో కలిసి త్వరలో యాక్షన్ ప్లాన్ తయారుచేసి, నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తిచేస్తామని చెప్పారు. నగరంలో మంగళవారం మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. పాతనగరానికి ఫరుఖ్‌నగర్ వద్ద టీఎస్‌ఆర్టీసీ రూ.8 కోట్లతో నిర్మించిన బస్‌స్టేషన్, బస్‌డిపోను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, టీఎస్‌ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రారంభించారు. మొఘల్‌పురాలో కొత్తగా నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన బస్‌స్టేషన్ కాంప్లెక్స్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలకోసం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి స్థానికంగా అనువైన స్థలాలను కేటాయిస్తామని, ఫరుఖ్‌నగర్ వద్ద ఉన్న పోలీసు శాఖ స్థలాన్ని కూడా ఇందుకోసం పరిశీలిస్తామని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిర్మాణ పనులు మొదలుకాగా, ఫిలింనగర్ ప్రాంతంలో త్వరలో రూ.280 గృహాల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించామన్నారు. సంక్షేమం విషయంలో రాజకీయాలకు అతీతంగా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొంటూ, ఎమ్మెల్యే కోటా కింద అభివృద్ధి పనులకోసం విడుదల చేసే నిధులపై జిల్లా మంత్రికి బదులు స్థానిక ఎమ్మెల్యేకి పూర్తి అధికారం ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు

LEAVE A REPLY