పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఇండియా

0
24

బ్యాంకాక్‌: మ‌హిళ‌ల టీ20 ఏషియాక‌ప్‌ను గెలిచింది టీమిండియా. ఫైన‌ల్లో పాకిస్థాన్‌పై 17 ప‌రుగుల తేడాతో గెలిచి వ‌రుస‌గా ఆరోసారి ట్రోఫీ ఎగ‌రేసుకుపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆరు టీ20 ఏషియాక‌ప్ టోర్నీలు జ‌ర‌గ‌గా.. అన్నిసార్లూ మ‌న మ‌హిళ‌ల జ‌ట్టే విజేత‌గా నిల‌వ‌డం విశేషం. ఈ టోర్నీలో ఆడిన మొత్తం 32 మ్యాచుల్లోనూ మ‌న‌దే విజ‌యం. ఈసారి ఫైన‌ల్లో టీమిండియా విజ‌యంలో హైద‌రాబాదీ స్టార్ మిథాలీరాజ్ (73 నాటౌట్‌) కీల‌క‌పాత్ర పోషించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌.. 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 121 ప‌రుగులు చేసింది. మిథాలీ 65 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 73 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచింది. ఈ టోర్నీ లీగ్ స్టేజ్‌లోనూ పాకిస్థాన్‌పై భార‌త్ గెలిచిన విష‌యం తెలిసిందే.

ఫైన‌ల్లో మిథాలీ ఒంట‌రిపోరాటం చేసింది. చివ‌ర్లో బౌల‌ర్ ఝుల‌న్ గోస్వామి ధాటిగా ఆడి 17 ప‌రుగులు చేయ‌డంతో భార‌త్ చెప్పుకోద‌గిన స్కోరు సాధించ‌గ‌లిగింది. చేజింగ్‌లో పాక్ మొద‌ట్లో బాగానే ఆడినా.. ఓవైపు వికెట్లు కోల్పోతూనే ఉండి. పాక్ కెప్టెన్ బిస్మా మ‌రూఫ్ 25 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. స్పిన్న‌ర్ ఏక్తా బిష్త్ రెండు, మిగ‌తా న‌లుగురు బౌల‌ర్ల త‌లా ఒక వికెట్ తీసుకున్నారు. చివ‌రికి పాక్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 104 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. మ‌హిళ‌ల ఏషియ‌క‌ప్ 2004-08 మ‌ధ్య‌లో నాలుగుసార్లు 50 ఓవ‌ర్ల ఫార్మాట్‌లో జ‌ర‌గ‌గా.. 2012లో తొలిసారి టీ20 ఫార్మాట్‌లో టోర్నీ నిర్వ‌హించారు. చివ‌రి రెండు టోర్నీ ఫైన‌ల్స్‌లో పాకిస్థాన్‌ను ఓడించే మ‌న మ‌హిళ‌ల జ‌ట్టు విజేత‌గా నిల‌వ‌డం గమ‌నార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here