పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు.. జూలై చివరికల్లా పూర్తి

0
3

పంచాయతీ ఎన్నికలను జూలై చివరినాటికి పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి కోరారు. ఖరారుచేసిన రిజర్వేషన్ల జాబితా ఇవ్వగానే నోటిఫికేషన్ జారీచేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా నాగిరెడ్డి ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు జూలైలో నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌తోసహా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో ఎన్నికల సంఘం బుధవారం సమావేశమై, సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ఏర్పాట్లు, ఆయా శాఖల నుంచి కావాల్సిన సహకారాన్ని ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ రెండు నెలల కాలంలో కొత్త కార్యక్రమాలను చేపట్టవద్దని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా పటిష్ఠ ప్రణాళికలు రూపొందించాలని జిల్లాల అధికారులకు సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్‌శాఖ చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ఇతర రాష్ర్టాల నుంచి బలగాలను తీసుకురావాలన్నారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా సిద్ధంచేశామని నాగిరెడ్డి వివరించారు.

LEAVE A REPLY