నోట్ల గడువు ముగిసిన వేళ మోదీ మాట

0
24
‘దేశవ్యాప్తంగా రెండు వారాల్లో ఆధార్‌ ఆధారిత చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తీసుకొస్తాం. అప్పుడు మీ వేలి ముద్రే మీ బ్యాంకుగా మారుతుంది’ అని ప్రఽధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ‘డిజీ ధన్‌ మేళా’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘అదృష్ట వ్యాపారి’ పథకంలో భాగంగా తొలి డ్రాను తీసి, అనంతరం ప్రసంగించారు. ప్రధాని ఆద్యంతం నవ్వుతూ.. నవ్విస్తూ.. విమర్శకులపై వ్యంగ్యాసా్త్రలను ఎక్కుపెడుతూ మాట్లాడారు. ‘ఒకప్పుడు ఏమీ రాని వారిని వేలిముద్రగాళ్లు అని ఎగతాళి చేసేవారు. ఇప్పుడు ఆ వేలి ముద్రే బ్యాంకుగా మారుతుంది. డిజిటల్‌ లావాదేవీలు జరిపేందుకు ప్రజలు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. కేవలం వేలి ముద్ర వేసి నగదు రహిత లావాదేవీలు జరుపుకొనే ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను రెండువారాల్లో ప్రవేశపెడతాం’ అని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌ ఫోన్ల ద్వారా రోజుకి కనీసం 5 లావాదేవీలు నిర్వహించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో భారతదేశంలో డిజిటల్‌ విప్లవం రాబోతోందన్నారు.
           భారతదేశం మారుతోందని, ఈ మార్పు దేశంలో పేదల తలరాతలను మారుస్తుందన్నారు. పేదలే రాబోయే మార్పునకు హక్కుదారులవుతారన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని పేదల కోసమేనని ఉద్ఘాటించారు. కష్టాలు పడి మరీ దేశం తనను ఆశీర్వదించిందన్నారు. నిరక్షరాస్యత అధికంగా ఉన్న మన దేశంలోనే ఈవీఎం యంత్రాల ద్వారా ఓటింగ్‌ను ప్రవేశపెట్టారని, ఇది విజయవంతం అయ్యిందన్నారు. పేద ప్రజల పురోభివృద్ధికి సాంకేతికత ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. స్వీయ తప్పిదాల వల్లే ఒకప్పుడు బంగారు చిలుకగా పేరుపొందిన భారత పేద దేశంగా మారిందన్నారు. స్వర్ణ భారతను నిర్మించుకొనే సామర్థం మనకు ఉందని స్పష్టం చేశారు. తనలోని తప్పుల్ని వదులుకొనేందుకు దేశం సిద్ధంగా ఉందని, తనతో తాను పోరాడేందుకు ఏకమైందని చెప్పారు. దేశ ధనంపై ప్రథమ హక్కు పేదలకే ఉండాలని స్పష్టం చేశారు. పేదల కష్టాలు తీర్చేందుకు డిజిటలీకరణ దోహదపడుతుందన్నారు. పేదరిక నిర్మూలన ప్రకటనలతో సాధ్యం కాదని, ఆచరణ ముఖ్యమన్నారు.

LEAVE A REPLY