నోటిఫికేషన్‌కు కేంద్రం కట్టుబడాలి:సుప్రీం

0
30

రూ.వెయ్యి, రూ.500 నోట్ల రద్దు అనంతరం బ్యాంకు ఖాతాదారులు తమ అవసరాలకోసం వారానికి రూ.24వేలు తీసుకోవచ్చన్న నోటిఫికేషన్‌కు కేంద్రం కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నోటిఫికేషన్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అభిప్రాయపడింది. నోటిఫికేషన్‌ను సవరిస్తే తప్ప అప్పటివరకు ఆ ప్రకారం డబ్బులు తీసుకునే హక్కు ఖాతాదారులకు ఉంటుందని పేర్కొంది. భారీ సంఖ్యలో ప్రజలు కొద్ది మొత్తం కూడా దొరుకకుండా అవస్థలు పడుతుంటే, మరికొందరు మాత్రం కోట్ల కొద్దీ కొత్త నోట్లను ఎలా పొందుతున్నారని ప్రశ్నించింది. నోట్ల రద్దును సవాల్ చేసిన ఓ పిటిషనర్ తరపున గురువారం సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ప్రతిస్పందించింది.
సవరిస్తే తప్ప వారానికి రూ.24వేలు తీసుకోవచ్చన్న నోటిఫికేషన్‌కు (ప్రభుత్వం) కట్టుబడి ఉండాల్సిందే అని పేర్కొంది. నోట్ల రద్దు అనంతరం ప్రజలు చేతుల్లో డబ్బుల్లేక అవస్థలు పడుతున్నారని పిటిషనర్ తరపున హాజరైన సిబల్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం ఒక వ్యక్తి వారానికి రూ.24 వేలు తీసుకోవచ్చు. ఎవరు కూడా ఈ హక్కును తోసిపుచ్చలేరు అని పేర్కొన్నారు. కరెన్సీ సమ స్య ఉందని అటార్నీ జనరల్ అంటున్నారు. సరిపోయినంత నగదు లేదని చెప్తున్నారు. డబ్బు లేనప్పుడు ఇలాంటి హక్కును ఇవ్వాల్సింది కాదు అని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట సిబల్ తెలిపారు. నోట్ల రద్దు నోటిఫికేషన్ అనంతరం నవంబర్ 8 తర్వాత మూడురోజుల్లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీలు) రూ.8000 కోట్లు సేకరించాయని, పాత నోట్లను మార్పిడి చేయడానికిగానీ, డిపాజిట్ చేయడానికిగానీ వాటిని అనుమతించలేదని సిబల్ చెప్పారు. దీంతో వాటి వ్యాపారం దెబ్బతింటున్నదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here