నైజీరియాలో కుప్పకూలిన చర్చి

0
19

నైజీరియాలోని ఓ చర్చి కుప్పకూలింది. అదీ బోధనలు జరుగుతున్న సమయంలోనే ప్రమాదం జరగడంతో భవన శిథిలాల కింద చిక్కుకుపోయి దాదాపు 160 మంది మృతి చెందారు. ఆక్వా ఐబోమ్‌ రాష్ట్ర రాజధాని యుయోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ద రైనర్స్‌ బైబిల్‌ చర్చిలో బిషప్‌ ఆకన్‌ వీక్స్‌ శనివారం.. సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర గవర్నర్‌ ఉదమ్‌ ఇమ్మాన్యుయేల్‌ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ప్రసంగాలు కొనసాగుతుండగానే ఒక్కసారిగా భవనం కుప్పకూలి.. హాజరైన వారందరినీ శిథిలాలు కప్పేశాయి. అయితే గవర్నర్‌ ఇమ్మాన్యుయేల్‌, బిషప్‌ వీక్స్‌లు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన సిబ్బంది.. ఇప్పటికి 60 మంది మృతదేహాలను వెలికితీశారు. అయితే చర్చి భవనం ఇంకా నిర్మాణంలోనే ఉందని, శనివారం నాటి కార్యక్రమం కోసం ఆదర బాదరాగా సిద్ధం చేశారని స్థానికులు తెలిపారు. భవన నిర్మాణం విషయంలో ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే.. కూలిపోయిందా అన్న కోణంలో ప్రభుత్వం విచారణ చేపట్టినట్లు గవర్నర్‌ అధికార ప్రతినిధి ఎకరేట్‌ ఉదోహ్‌ తెలిపారు. కాగా నైజీరియాలో భవనాలు కూలిపోవడమన్నది సర్వసాధారణంగా మారిపోయింది. కాంట్రాక్టర్లు సరైన సామగ్రి ఉపయోగించకపోవడం, అధికారులు అవినీతికి పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం వల్లే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. అయితే దేశంలో ఇప్పటిదాకా 2014లో లాగో్‌సలో జరిగిన ప్రమాదమే అతిపెద్దదిగా ఉండేది. నైజీరియా వాణిజ్య రాజధాని అయిన లాగో్‌సలో బహుళ అంతస్థులతో కూడిన సినగోగ్‌ చర్చి కూలిపోయిన ఆ ఘటనలో 116 మంది మృతి చెందారు. తాజా ఘటనలో మృతుల సంఖ్య దానిని మించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై దేశాధ్యక్షుడు ముహమ్మదు బుహారి విచారం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ప్రమాదాన్ని ఇంతకుముందెప్పుడూ చూడలేదన్నారు. ఇదిలా ఉండగా.. ఈజిప్టు రాజధాని కైరోలో ఓ చర్చిలో ఆదివారం బాంబు పేలుడు సంభవించి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. సెయింట్‌ మార్క్స్‌ కేథడ్రల్‌ చర్చికి అనుబంధంగా ఉన్న సెయింట్‌ పీటర్స్‌ చర్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 10గంటలకు జనం పెద్ద సంఖ్యలో ప్రార్థనకు హాజరైన సమయంలో ఇది పేలినట్లు స్థానిక మంత్రి వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదులు పల్మిరా నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here