నేటి నుంచి పార్లమెంట్

0
9

కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి సెంట్రల్ హాల్‌లో ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం అరగంట విరామం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పిస్తారు. రెండు వితడలుగా జరిగే బడ్జెట్ సమావేశాల్లో తొలి సెషన్ జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు, రెండో సెషన్ మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు జరుగుతుంది. ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు మార్చి 8వ తేదీతో ముగుస్తున్నందున 9వ తేదీ నుంచి రెండవ సెషన్ ప్రారంభమవుతుంది. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. ఫిబ్రవరి నెల చివరి రోజున వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించేవారు. కానీ.. ఈసారి నెల రోజులు ముందుగానే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దీనికి తోడు రైల్వే బడ్జెట్‌ను కూడా కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేసినందువల్ల రైల్వే బడ్జెట్‌పై జరిగే చర్చా సమయాన్ని కూడా ఆదా చేయడానికి వీలు కలిగింది. రెండో విడత సమయంకల్లా యూపీ సహా ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడవుతాయి. వాటిలో ప్రజాతీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి విపక్షాలు ఎదురుచూస్తున్నాయి. కేంద్రం 39 కొత్త బిల్లులు (ద్రవ్య బిల్లుల్ని కలుపుకుని), ఇప్పటివరకూ పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదం పొందాలని భావిస్తున్నది.

సమావేశాలకు సహకరించాలని కోరిన ప్రధాని

దేశ అభివృద్ధి కోసం బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పలు విపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు, అభిప్రాయభేదాలు ఉండవచ్చుగానీ దేశ హితం కోసం సమావేశాలకు సహకరించాలని కోరారు. మంగళవారం నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మోదీ ఈ బడ్జెట్ సమావేశాలను మహా పంచాయతీగా అభివర్ణించారు. విపక్షాలు లేవనెత్తే ఏం అంశంమీదనైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. శీతాకాల సమావేశాల్లో నోట్ల రద్దు నిర్ణయం కారణంగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన అంశాన్ని గుర్తుచేసి ఈ సమావేశాలైనా సజావుగా జరగాలని కోరారు. అఖిలపక్ష సమావేశాన్ని తృణమూల్ కాంగ్రెస్, శివసేన బహిష్కరించాయి. నోట్ల రద్దు నిర్ణయానికి నిరసనగా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు రెండు పార్టీలూ స్పష్టం చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here