నెల్లూరు, చిత్తూరులో బీభత్సం.. తిరుపతిలో జోరు వాన

0
27

వర్దా పెనుతుఫాను ప్రభావం నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై పడింది. పెనుగాలులకు భారీవర్షాలు తోడై.. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. తీవ్ర గాలులకు వందల వృక్షాలు నేలకూలాయి. రాకపోకలు నిలిచిపోయాయి. చాలా చోట్ల విద్యుత సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కడప, ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వచ్చే 48 గంటల్లో భారీవర్షాలు కురుస్తాయన్న హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నంలలో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. 110 కి.మీ వేగంతో వీచిన పెనుగాలులు సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ఆయిల్‌ ట్యాంక ర్‌ సూళ్లూరుపేట వద్ద బోల్తా పడింది. ఇక్కడే రైల్వే ట్రాక్‌ పై చెట్లు పడడంతో చెన్నై-గూడూరు మధ్య రైళ్ల రాకపోక లు ఆగిపోయాయి. తడ మండలం ఇరకం గ్రామంలో 30 గుడిసెలు కూలిపోయాయి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. సముద్రం సుమారు 100 అడుగులకుపైగా ముందుకు రావడంతో తీర ప్రాంత గ్రామాలు భీతిల్లుతున్నాయి. సముద్రంలో వేటకు వచ్చిన 18 మంది తమిళ మత్స్యకారులు ఆదివారం రాత్రి శ్రీహరికోట వద్ద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న కలెక్టర్‌ ముత్యాలరాజు కృష్ణపట్నం పోర్టు కోస్ట్‌గార్డుతో మాట్లాడి రక్షించారు. తీర ప్రాంతాల్లోని 11 మండలాల్లో ఉన్న 68 పునరావాస కేంద్రాలకు 12వేల మందిని తరలించి భోజన వసతి కల్పించారు. మంత్రి నారాయణ, తుఫాన స్పెషల్‌ ఆఫీసర్‌ బి.శ్రీధర్‌, కలెక్టర్‌ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వర్షాలపై నెల్లూరు కలెక్టర్‌తో కేంద్ర మంత్రి వెంకయ్య ఢిల్లీ నుంచి చర్చించారు. కాగా, సూళ్లూరుపేట, చిట్టమూరు, తడ, నాయుడుపేట ప్రాంతాల్లో బలమైన గాలులు వీయడంతో సోమవారం వేకువ జామున 2 గంటల నుంచే విద్యుత సరఫరా ఆగిపోయింది. ఈ పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. వాకాడులో 9.7 సెం.మీ వర్షపాతం, సూళ్లూరుపేటలో 9.3, తడలో 8.7, దొరవారిసత్రంలో 8.7, చిట్టమూరులో 7.3, పెళ్లకూరులో 7.1 వర్షపాతం నమోదవగా, నెల్లూరులో 3.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. చలిగాలులను తట్టుకోలేక చిల్లకూరు మండలం పల్లమాలలో అమృత (45) అనే మహిళ మరణించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here