నాగాలాండ్‌లో ఏం జరుగుతున్నది?

0
17

ఆదివాసుల రాష్ట్రం నాగాలాండ్ ఇప్పుడు మరోసారి రగిలిపోతున్నది. ప్రభుత్వం తమ సంప్రదాయ ఆచారాలను అణచివేస్తున్నదని ఆదివాసీలు తిరుగబడ్డారు. నాగాలాండ్‌లో తమ మనోగతానికి విరుద్ధంగా పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పనను నిరసిస్తూ ఆదివాసులు తిరుగుబాటు జెండా ఎగురేశారు. తీవ్ర ఆగ్రహావేశాలతో నాలుగురోజులు ప్రభుత్వ కార్యాలయాల దహనం, ధ్వంసం వంటి చర్యలకు దిగారు. గుంపులుగా గుంపులుగా విధ్వంసకాండకు పాల్పడుతున్నవారిపై బుధవారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సీఎం టీఆర్ జెలియాంగ్ క్యాబినెట్ రాజీనామా చేయాలని, ఎన్నికలు చెల్లవని ప్రకటించాలన్న ఆదివాసుల ఆందోళనకు వివిధ ప్రజాసంఘాలు మద్దతు తెలుపడంతో పరిస్థితి తీవ్రతను గమనించిన సీఎం.. ఎన్నికలను రద్దుచేస్తున్నట్లు, దిమాపూర్ పోలీసు కమిషనర్‌ను, డీసీపీని బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఎందుకీ తిరుగుబాటు?

భారత రాజ్యాంగంలోని 371వ అధికరణం ప్రత్యేకమైనది. ఈ ఆర్టికల్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఆచార వ్యవహారాలు, ప్రత్యేక జీవన విధానాలను బట్టి చట్టాల అమలుకు కొన్ని మినహాయింపులిచ్చింది. విశేషాధికారాలు కల్పించింది. నాగాలాండ్‌లోని జెలియాంగ్ ప్రభుత్వం తమ సంప్రదాయ ఆచారాలకు విరుద్ధంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిం చడాన్ని ఆదివాసీ సమాజం తీవ్రంగా తప్పుబట్టింది. నాగా హోహో, ఈఎన్పీవో, ఎన్టీసీ, ఎన్సీడీ, ఏపీవో, ఏవో సెడెన్ వంటి ఆదివాసీ సంస్థలు మహిళలకు రిజర్వేషన్లను వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (ఏ)ను ఉల్లంఘించడమేనన్న్డాయి.సీఎం టీఆర్ జెలియాంగ్, డెమోక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్) చైర్మన్ డాక్టర్ షుర్హోజెలీ ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నారు. కోహిమా, దిమాపూర్ నగరాలు సహా పలు ప్రాంతా ల్లో దహనాలు, విధ్వంసకాండ సాగింది. పోలీసు కాల్పుల్లో మరణించిన ఇద్దరు యువకుల అంత్యక్రియల నిర్వహణకు ఆదివాసీ సంస్థలు నిరాకరించాయి. తమ డిమాండ్లను నెరవేర్చాకే మృతదేహాలను తీసుకెళుతామని స్పష్టం చేశాయి. రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకుంటామన్న గవర్నర్ పీబీ ఆచార్య హామీతో శుక్రవారం యువకులకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అలజడి నాగాలాండ్ వ్యవహారాలపైనేకాక, యునైటెడ్ నాగా కౌన్సిల్ ఆర్థిక దిగ్బంధాన్ని విధించిన పొరుగున ఉన్న మణిపుర్‌పైనా ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here