నల్లధనంపై ఐటీ కొరడా

0
21

నల్లధనాన్ని నిర్మూలించే క్రమంలో మరిన్ని నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. ఈ మేరకు ఆదాయం పన్ను సవరణ బిల్లును తీసుకువచ్చింది. అప్రకటిత ఆదాయంగా ఉన్న రద్దయిన పెద్ద నోట్లను స్వచ్ఛందంగా డిసెంబర్ 30లోపు డిపాజిట్ చేస్తే దానిపై 50శాతం పన్ను తో సరిపోతుందని ఆ బిల్లు పేర్కొంటున్నది. లేనిపక్షంలో అనంతరం అధికారుల సోదాల్లో సదరు అప్రకటిత సొమ్ము పట్టుబడిన పక్షంలో దానిపై పన్నులు, జరిమానాలు కలుపుకొని గరిష్ఠంగా 85శాతం వరకు చెల్లించాల్సి ఉంటుందని బిల్లులో ప్రతిపాదించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రతిపక్షాలు సభలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్న సమయంలోనే పన్నుల చట్టాలు (రెండో సవరణ) బిల్లు-2016ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన మూడు వారాల తర్వాత ప్రభుత్వం ఈ బిల్లు తీసుకువచ్చింది. ఆర్థిక బిల్లు రూపంలో దీనిని తీసుకువచ్చిన రీత్యా ఒక్క లోక్‌సభ ఆమోదమే సరిపోతుంది. ప్రతిపక్షాల సభ్యులు మెజార్టీ సంఖ్యలో ఉన్న రాజ్యసభకు దీనిని పంపించాల్సిన అవసరం ఉండదు.

LEAVE A REPLY