నయీం దోస్తులు..ఐదుగురు ఖాకీలపై వేటు

0
14

గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో పెద్ద సంచలనం. నయీంతో అంటకాగి అతడి అక్రమాలకు, అవినీతి పనులకు చేదోడువాదోడుగా నిలిచిన పలువురు పోలీసు అధికారులపై వేటు పడింది. ఒక అదనపు ఎస్పీతోపాటు మొత్తం ఐదుగురిని సస్పెండ్ చేయగా.. మరో నలుగురు అధికారులపై ఓవరాల్ ఎంక్వైరీకి ఆదేశించారు. మరో 16 మంది పోలీసు అధికారులను స్వల్పశిక్షతో వదిలిపెట్టారు. మొత్తమ్మీద.. ఒక క్రిమినల్‌తో సంబంధాలు పెట్టుకున్న కేసులో ఇంతమంది పోలీసు అధికారులపై ఒకేసారి చర్యలు తీసుకోవడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుగలేదు. తప్పుచేసిన వారు ఎంతటివారైనా సరే విడిచిపెట్టేది లేదని సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే క్షేత్రస్థాయిలో అమలవుతోంది. అనేక రకాల అక్రమాలకు పాల్పడిన నయీంతో సంబంధం ఉన్న వారు ఎవరైనా వదిలిపెట్టవద్దు అంటూ సీఎం ఆదేశించారు. పోలీసులు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. న యీంతో సంబంధాలు కొనసాగించిన అన్ని వర్గాలపై దృష్టి పెట్టారు. రాజకీయ నాయకులు, పోలీసుల పాత్రపై కూడా ఆరా తీశారు. ఈ క్రమంలో 25 మంది పోలీసులను గుర్తించారు. గ్యాంగ్‌స్టర్‌తో లింక్ ఉన్నట్టు పక్కా ఆధారాలు లభించటంతో చర్యలు తీసుకున్నారు. ఐదుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో నలుగురిపై శాఖ పరమైన విచారణకు (ఓవరాల్ ఎంక్వయిరీకి) ఆదేశించారు. మిగతా 16 మందిపై శాఖ పరమైన (మైనర్ పనిష్‌మెంట్) చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు డీజీపీ అనురాగ్ శర్మ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here