నగదు విత్‌డ్రా పరిమితులు ఎత్తివేత

0
18

సామాన్య ప్రజలకు, చిన్న వ్యాపారులకు నగదు కష్టాల నుంచి రిజర్వు బ్యాంకు మరింత ఉపశమనం కలిగించింది. కరెంట్ ఖాతాలు, క్యాష్ క్రెడిట్ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాల వారిపై నగదు ఉపసంహరణకు విధించిన అన్ని పరిమితులను ఎత్తివేసింది. ప్రస్తుతం రోజుకు రూ.10వేలు మాత్రమే తీసుకోగలుగుతున్న సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు ఇకపై ఒకేసారి రూ.24వేలను బ్యాంకులు లేదా ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే వీరు వారంలో రూ.24వేలకు మించి విత్‌డ్రా చేసుకోరాదన్న ఆంక్షలు కొనసాగుతాయి. ఈ నిర్ణయాలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయని ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. బ్యాంకులకు అందుతున్న నగదు ఆధారంగా త్వరలోనే వారం పరిమితిని కూడా ఎత్తివేస్తామని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత నగదు పంపిణీ పరిస్థితిని సమీక్షించిన అనంతరం పెద్ద నోట్లు రద్దయ్యే నాటి పూర్వ స్థితిని పాక్షికంగా పునరుద్ధరించాలని నిర్ణయించాం అని ఆర్బీఐ పేర్కొంది. దీంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణపై విధించిన పరిమితులు కొంతమేరకు తొలగిపోతాయని తెలిపింది. అయితే పరిమితులపై నిర్ణయం తీసుకొనే అధికారం బ్యాంకులకే కల్పిస్తున్నట్లు పేర్కొంది. కరెంటు ఖాతాలు, క్యాష్ క్రెడిట్ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలలో నగదు ఉపసంహరణపై విధించిన అన్నిరకాల పరిమితులను ఎత్తివేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.

తమ ఖాతాదారులను డిజిటల్ చెల్లింపుల వైపు ప్రోత్సహించాలని బ్యాంకులకు సూచించింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన నగదు కొరత కారణంగా ప్రభుత్వం, ఆర్బీఐ ఏటీఎంల నుంచి బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. సేవింగ్స్ ఖాతాల వారిని ఏటీఎంల నుంచి తొలుత రోజుకు రూ.2500 మాత్రమే ఉపసంహరించుకొనేందుకు అనుమతించిన ఆర్బీఐ ఆ పరిమితిని ఈ నెల ఒకటి నుంచి రూ.4,500కు పెంచింది. ఆ తరువాత ఈ నెల 16 నుంచి ఆ పరిమితిని రూ.10వేలకు పెంచింది. అయితే ఆ మొత్తం వారానికి రూ.24 వేలకు మించకూడదని పరిమితి విధించింది. అలాగే కరెంట్ ఖాతాలున్న వారిని కూడా తొలుత వారానికి రూ.50వేల వరకు ఉపసంహరించుకొనేందుకు అనుమతించిన ఆర్బీఐ ఈనెల 16 నుంచి ఆ పరిమితిని రూ.లక్షకు పెంచింది. ప్రస్తుతం ఐదు రాష్ర్టాల్లో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు వెసులుబాటు కలిగించేందుకే ఆర్బీఐ కరెంట్ ఖాతాలపై పరిమితులను ఎత్తివేసినట్లు తెలుస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here