నగదురహితం తప్పదు

0
21

దేశ ప్రజలంతా డిజిటల్‌ లావాదేవీలను ఒక అలవాటుగా మార్చుకోవాలని డిజిటల్‌ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కన్వీనర్‌ చంద్రబాబు పిలుపునిచ్చారు. పాత తరహా విధానాలకు స్వస్తి చెప్పి డిజిటల్‌ విధానాలకు మళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ భవిష్యత్తులో దీని వల్ల మేలు జరుగుతుందన్నారు. డిజిటల్‌ లావాదేవీల జాతీయ కమిటీ గురువారం ముంబైలో ఆర్బీఐ అధికారులు, బ్యాంకర్లతో భేటీ అయింది. అనంతరం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు నీతి ఆయోగ్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో డిజిటల్‌ లావాదేవీలే ఉంటాయని, నగదు లావాదేవీలు గణనీయంగా తగ్గిపోతాయని చంద్రబాబు పేర్కొన్నారు. కార్డులు, పీఓఎస్‌ మెషీన్లు, ఆధార్‌, బయోమెట్రిక్‌, ఐరిస్‌ కలిగిన మొబైల్‌ ఫోన్లు, ఈ వాలెట్లే భవిష్యత్తులో ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాల్లో ఒక భాగమైపోయిందని, ఈ తరుణంలో డిజిటల్‌ లావాదేవీలను దూరం పెట్టలేమన్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గల అవకాశాలను పరిశీలించామని చెప్పారు. ఇందులో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని, వాటి పరిష్కారానికి ఏమేం చర్యలు తీసుకోవాలనే అంశాలపై బ్యాంకర్ల భేటీలో చర్చించామన్నారు. డిజిటల్‌ లావా దేవీలను చేపట్టేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ ప్రోత్సహిస్తామన్నారు. తాము ప్రధానంగా రెండు అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నామని, అందులో మొదటిది పీఓఎస్‌ మెషీన్ల వినియోగాన్ని పెంచటం కాగా.. రెండోది ప్రతి మొబైల్‌ను ఒక మినీ ఏటీఎంగా మార్చటం అని చెప్పారు. ఆధార్‌ సహిత బయోమెట్రిక్‌ వ్యవస్థతో మొబైల్‌ను అనుసంధానించటం ద్వారా ప్రతి మొబైల్‌ ఒక బ్యాంకులా మారిపోతుందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here