నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు

0
34

నకిలీ ఏజెంట్ల ద్వారా బతుకుదెరువు కోసం వెళ్లి విదేశాల్లో… ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న వారు మాటల్లో చెప్పలేని వేధింపులకు గురవుతున్నందున దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర విదేశాంగ శాఖ, దూరదర్శన్‌ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు. గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న వారి కుటుంబసభ్యులు తరచూ తనను కలిసి తమ వారు అక్కడ పడుతున్న బాధలను తన దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు. నకిలీ ఏజెంట్లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని గుర్తించడం ఒక బాధ్యత అయితే… నకిలీ ఏజెంట్ల బారిన పడకుండా ప్రసార సాధనాల ద్వారా ప్రజలను చైతన్య పరచడం మరో బాధ్యత అని వివరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా నిరంతరం చర్చలు జరపాలన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ ఇచ్చిన సమాచారం ఆధారంగా దూరదర్శన్‌, ఆకాశవాణి, తన మంత్రిత్వ శాఖకు చెందిన సోషల్‌ మీడియా ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. అమాయకులు, నిరక్షరాస్యులైన ప్రజలు నకిలీ ఏజెంట్ల మాయ మాటలకు లోనై విదేశాలకు వెళ్తుంటారని, వారికి అర్థమయ్యే భాషలో చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. ఇటీవల అబుదాబి రాకుమారుని గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో ప్రిన్స్‌ అల్లుడు, ఉప ప్రధానమంత్రితో తాను ఈ విషయం ప్రస్తావించానని వెల్లడించారు. గల్ఫ్‌ దేశాల్లో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్‌ తదితర పనులకు వెళ్లిన భారతీయులు తీవ్ర వేధింపులకు గురవుతున్నారని, మహిళలు అక్రమరవాణా బారిన పడుతున్నారని, యజమానులు పాస్‌పోర్టులు తీసుకొని ఇవ్వని విషయాలు చెప్పగా అబుదాబి ఉపప్రధాని ఆశ్చర్యపోయారని వివరించారు. తమ దేశ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాలపై చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మన దేశం నుంచి సుమారు 85 లక్షల మంది గల్ఫ్‌ దేశాల్లో ఉపాధికి వెళ్లారని, రాజస్థాన్‌, బిహార్‌, యూపీలతో పాటు దక్షిణాది రాష్ట్రాల వారు అధికంగా ఉన్నారని అధికారులు ఆయనకు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయనేతల మద్దతు కూడా ఏజెంట్లకు ఉందని వారు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here