పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ ఫినిషర్ ఎవరంటే వినిపించే పేరు మహేంద్రసింగ్ ధోని. జట్టు ఎంత ఒత్తిడిలో ఉన్నా.. చేయాల్సిన పరుగులు ఎన్ని ఉన్నా.. ప్రత్యర్థి బౌలర్ ఎంతటి ప్రతిభావంతుడైనా ధోని చేతిలో చిత్తుకావాల్సిందే. మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటూ.. ఆనందాలకు పొంగిపోకుండా, నిరాశకు కుంగిపోకుండా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించి ‘కెప్టెన్ కూల్’గా నిలిచాడు మహీ. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతూ అత్యధిక వన్డే పరుగులు చేసిన ఆటగాళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. టాప్-5లో ముగ్గురు భారత్ క్రికెటర్లు ఉన్నారు.
బెస్ట్.. ఫినిషర్
ప్రస్తుతం అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ధోని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2004లో అరంగేట్రం చేసిన ధోని ఇప్పటి వరకు 286 మ్యాచ్‌ల్లో 50.96 సగటుతో 9275 పరుగులు చేశాడు. సారథిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్కువ మ్యాచ్‌ల్లో అతడు మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయినప్పటికీ ఓపెనర్ బ్యాట్స్మెన్లకు సాధ్యంకాని గొప్ప ఇన్నింగ్స్‌లు నెలకొల్పడం విశేషం. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ సారథిగా, బెస్ట్ ఫినిషర్‌గా ఘనత దక్కించుకున్నాడు.
సుడి‘గేల్’
క్రీజులో అడుగుపెడితే అతడికున్న ఏకైక లక్ష్యం ఫోర్లు, సిక్స్‌లు బాదడమే. మైదానంలో బ్యాట్‌తో చెలరేగడమే కాదు అభిమానులను ఉత్సాహపరిచేందుకు స్టెప్పులు కూడా వేస్తుంటాడు క్రిస్‌గేల్. ఇప్పటి వరకు 269 మ్యాచ్‌ల్లో 37.33 సగటుతో గేల్ 9221 పరుగులు చేశాడు.
360 డిగ్రీలు
బంతి ఎలా వచ్చినా తాను అనుకున్న రీతిలో బౌండరీ లైన్ దాటించేందుకు 360 డిగ్రీలను ఉపయోగించుకుంటాడు దక్షిణాఫ్రికా విధ్వంసక క్రికెటర్ ఏబీ డివిలియర్స్. కెరీర్లో ఇప్పటి వరకు 215 మ్యాచ్‌లు ఆడిన ఏబీ 54.47 సగటుతో 9152 పరుగులు సాధించాడు.
ఆరు సిక్సర్ల వీరుడు
ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాది ప్రపంచదృష్టిని ఆకర్షించాడు భారత క్రికెటర్ యువరాజ్‌సింగ్. వూపువచ్చిందంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయి. క్యాన్సర్‌ను జయించిను యువీ ఇటీవల జట్టులోకి పునరాగమనం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 296 వన్డేల్లో 36.80 సగటుతో 8539 పరుగులు సాధించాడు యువీ.
పరుగుల యంత్రం
విరాట్ కోహ్లి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. అతి తక్కువ వయసులోనే దిగ్గజాలకు సైతం వీలుకాని రికార్డులను నెలకొల్పుతున్నాడు. సునాయాసంగా శతకాలు, ద్విశతకాలు బాదేస్తున్నాడు. ధోని నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించి భారత్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. విరాట్ తన వన్డే కెరీర్లో 179 మ్యాచ్‌ల్లో 53.11 సగటుతో 7755 పరుగులు సాధించాడు.