ధోనీ అలా మారడానికి కారణం ఎవరంటే..!

0
10
టీమిండియా స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ… ప్రస్తుతం విరాట్ కోహ్లీ సేనలో కీలక ఆటగాడిగా ట్రాక్ మీదికొచ్చాడు. ఈ ఏడాది ధోనీ ఇంతలా మారడానికి కారణం కెప్టెన్ విరాట్ కోహ్లీయేనని మాజీ ఆటగాడు సౌరబ్ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మనం ఆటగాళ్లపై చూపించే విశ్వాసం ద్వారానే ఆటగాళ్లు నెగ్గడమా, ఢీలా పడడమా అన్నది ఆధారపడి ఉంటుందనీ.. ధోనీని ఇవాళ మనం ఇలా చూడడానికి కోహ్లీయే ప్రధాన కారణమై ఉండవచ్చునని అన్నాడు. కొంతకాలం పాటు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తడబడుతూ వచ్చిన ధనాధన్ ధోనీ 2017లో దూకుడు పెంచాడు. ఆదివారం ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో ధోనీ నింపాదిగా ఆడుతూ… 79 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.
‘‘ధోనీ అలా ఆడతాడన్న ఆత్మవిశ్వాసం కెప్టెన్‌కి ఉంది. చాలా వరకు ఈ ఘనత విరాట్ కోహ్లీకే చెందుతుంది. ఎందుకంటే ధోనీ మీద కోహ్లీ అంత నమ్మకం పెట్టుకున్నాడు. ఆ కారణంగానే ధోనీ ఎలా ఆడాలనుకుంటున్నాడో అలా ఆడుతున్నాడు..’’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఇప్పటికే అనేక రికార్డులు సాధించిన ధోనీ ముందు ముందు మరింతగా రాణించే అవకాశం ఉందన్నాడు. ‘‘ఆటగాళ్లు ఎక్కువ కాలం ఆడడం వల్ల పరుగులు ఎలా రాబట్టాలో వాళ్లకు తెలుసు. ఎమ్ఎస్ ధోనీ ఇప్పటికే 300 వన్డేలు ఆడాడు. వన్డే క్రికెట్‌లో అజేయంగా 9 వేల పరుగులు సాధించాడు. అతడు వన్డే ఫార్మాట్ నుంచి బయటికి వచ్చే సమయానికి మరిన్ని పరుగులు సాధించే అవకాశం ఉంది…’’ అని గంగూలీ పేర్కొన్నాడు.
అలాగే 83 పరుగులతో కెరీర్లోనే బెస్ట్ స్కోర్ సాధించిన హార్దిక్ పాండ్యా పైనా గంగూలీ ప్రశంసలు కురిపించాడు. ధోనీతో కలిసి పాండ్యా 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. 2017లో ధోనీ ఇప్పటి వరకు 19 మ్యాచ్‌లు ఆడగా… 627 పరుగులు సాధించి ఏకంగా 89.57 సగటుతో శెభాష్ అనిపించుకుంటున్నాడు. కాగా ఆదివారం ధోనీ వడివడిగా ఆడటాన్ని బట్టే వర్షం వచ్చినా భారత్ నెగ్గింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించడంతో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

LEAVE A REPLY