దోస్త్ మేరా దోస్త్

0
30

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాకు భారత్ నిజమైన నేస్తం.. సిసలైన భాగస్వామి అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోదీతో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిపిన టెలిఫోన్ సంభాషణలో రెండు దేశాల సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనేక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఒకరినొకరు ఆహ్వానించుకున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రెండు దేశాలు భుజంభుజం కలిపి నడుస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. ఆర్థిక, రక్షణ సంబంధాలను సుపటిష్ఠం చేయాలని అన్నారు.

అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్ ఫోన్ చేసిన మొదటి ఐదారుగురిలో ప్రధాని మోదీ ఉండటం భారత్‌తో సంబంధాలకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యం వ్యక్తమవుతున్నదని పరిశీలకులు అంటున్నారు. జర్మనీ, జపాన్, చైనా, రష్యా వంటి కీలక దేశాల కంటే ముందుగా ట్రంప్ భారత్‌తో సంప్రదింపులు జరుపడం విశేషం. వాణిజ్యం, రక్షణ, ఉగ్రవాదంతోపాటు అనేక అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక రక్షణ రంగాల్లో సహకార విస్తరణకు గల అవకాశాలను చర్చించారు. దక్షిణ, మధ్య ఆసియా భద్రతపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు రాబోయే రోజుల్లో సన్నిహితంగా కృషి చేయాలని అభిప్రాయపడ్డారు అని వైట్‌హౌస్ తెలిపింది. నిన్న సాయంత్రం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహృదయ సంభాషణ జరిగింది అని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌ను ఇండియాకు ఆహ్వానించానని కూడా వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here