దేశం ముస్తాబైంది

0
10

68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీతోపాటు, అన్ని రాష్ర్టాల్లో సంబురాలు నిర్వహించే మైదానాలు మువ్వన్నెల రెపరెపల కోసం ముస్తాబయ్యాయి. వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శనలతో అబ్బురపరిచేందుకు విద్యార్థులు, కళాకారులు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. పోలీసులు, భద్రతాబలగాలు, ఎన్‌సీసీ కాడెట్లు తదితరులు కవాతు నిర్వహణకు సిద్ధమయ్యారు. పాఠశాలల్లో చిన్నారులు వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారు. విద్యాసంస్థలు, పలు కార్యాలయాలు, పరిశ్రమల ప్రాంగణాలు మూడు రంగుల తోరణాలతో వేడుకల నిర్వహణకు ముస్తాబయ్యాయి. జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

వేడుకలకు అతిథిగా అబుదాబి యువరాజు

ఢిల్లీలో గురువారం జరుగనున్న గణతంత్రవేడుకలకు ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ హాజరుకానున్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై భారత్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గురువారం ఉదయం ఆయన మరోమారు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య దాదాపు 16 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుండటంపై చర్చించే అవకాశం ఉన్నది. 2015లో కుదిరిన పెట్టుబడులు సహా పలు ఒప్పందాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్‌కు చెందిన ప్రత్యేక బృందం రిపబ్లిక్‌డే పెరేడ్‌లో కవాతు చేయనున్నది.

LEAVE A REPLY