దేవికి సీక్వెల్‌ ?

0
20

దేవి చిత్రానికి సీక్వెల్‌ ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్‌ వర్గాల నుంచి వస్తోంది. దేవి చిత్ర కథానాయకుడు, నిర్మాత ప్రభుదేవా అన్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం దక్షిణాదిని విడిచి ఉత్తరాదికి వెళ్లి అక్కడ పలు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రముఖ దర్శకుడిగా పేరు సాధించిన ప్రభుదేవా ఈ మధ్యనే మళ్లీ కోలీవుడ్‌కు తిరిగొచ్చి నిర్మాతగా అవతారమెత్తారు. ప్రభుదేవా స్టూడియోస్‌ చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి విజయ్‌ దర్శకత్వంలో దేవి చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించి అందులో కథానాయకుడిగా నటించారు. తమన్నా నాయకిగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం జయంరవి, హన్సిక జంటగా బోగన్ చిత్రంతో పాటు సిల సమయంగళ్, వినోదన్  చిత్రాలు ఈయన నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో బోగన్  చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. హీరోగా రీఎంట్రీలో మంచి విజయాన్ని అందించిన దేవి చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించే పనలో ప్రభుదేవా ఉన్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన పనులు ఇప్పటికే మొదలయ్యాయని తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ గా మళ్లీ తమన్నానే నటిస్తారా? దర్శకుడెవరు? దేవి చిత్రం మాదిరిగానే ఈ చిత్రాన్ని మూడు భాషల్లో నిర్మిస్తారా? లాంటి ప్రశ్నలకు సమాధానంతో పాటు ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతికవర్గం వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here