తెలుగు తెర ఆ‘నందో’త్సవం

0
31

నందులు మెరిశాయి. సినీ ఇంట ఆనంద కాంతులు తీసుకొచ్చాయి. చిత్రసీమ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నంది పురస్కారాల ప్రకటన వచ్చేసింది. గత కొన్నేళ్లుగా నంది అవార్డుల్ని పక్కన పెట్టేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎట్టకేలకు 2012, 2013 సంవత్సరాలకు గానూ నంది విజేతల్ని ప్రకటించింది. ఈసారి అటు ప్రయోగాత్మక చిత్రాలకు, ఇటు వాణిజ్య కథలకూ నంది పట్టం కట్టడం విశేషం. జయసుధ, కోడి రామకృష్ణల నేతృత్వంలో రెండేళ్ల సినిమాలకు అవార్డుల ఎంపిక కమిటీలు వేసింది ఏపీ ప్రభుత్వం. ఆ కమిటీలు బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలిసి పురస్కారాల ఎంపిక జాబితాలను అందజేశారు. 2012లో ‘ఈగ’ తన ప్రతాపం చూపించింది. హృద్యమైన చిత్రంగా విమర్శకుల కితాబులు అందుకొన్న ‘మిణుగురులు’ కూడా నంది అవార్డుల్లో మెరిసింది. ‘ఈగ’కు ఏకంగా 9 అవార్డులు వరించాయి. ‘మిణుగురులు’ ఖాతాలో ఏడు అవార్డులు చేరాయి. రెండూ కీటకాల పేర్లే.. అవే నంది అవార్డుల్లో కీలకంగా మారాయి. 2013లో అయితే కమర్షియల్‌ కథలకు పట్టం కట్టింది నంది జ్యూరీ. ఆ యేడాది ‘మిర్చి’ ఆరు నందులు సాధిస్తే, ‘అత్తారింటికి దారేది’కి ఐదు పురస్కారాలు దక్కాయి. ‘నా బంగారు తల్లి’ కూడా జ్యూరీని మెప్పించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకొంది. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ (2012)లో నటించిన నాని, సమంతలకు ఉత్తమ నటుడు, నటి పురస్కారాలు లభించాయి. ‘ఈగ’ చిత్రంలో నటించిన సుదీప్‌ ఉత్తమ ప్రతినాయకుడిగా నిలిచారు. 2013కిగాను ‘మిర్చి’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర కధానాయకుడు ప్రభాస్‌ ఉత్తమ నటుడిగా, సంపత్‌రాజ్‌ రాజ్‌ ఉత్తమ ప్రతినాయకుడిగా ఎంపికయ్యారు. ఆ చిత్రాన్ని రూపొందించిన కొరటాల శివ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నిలిచారు. ‘నా బంగారు తల్లి’లో నటించిన అంజలీ పాటిల్‌ ఉత్తమ నటిగా, ‘అలియాస్‌ జానకి’ రూపొందించిన దయా కొడవగంటి ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ‘అలియాస్‌ జానకి’ జాతీయ సమగ్రత చిత్రం విభాగంలో ఎంపికైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here