తెలంగాణ సూర్యుడు ఉద్యమాల వీరుడు

0
27

దేశంలో చిన్న రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ తక్కువ కాలంలోనే అద్భుతమైన పురోగతిని సాధిస్తున్నది. 24 గంటల కరెంట్‌తో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి వంటి పథకాల ద్వారా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తున్నది. రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పోరాటాన్ని, ఆయన పాలన విధానాన్ని పాట రూపంలో నువ్వేనా అది నీవేనా చిత్రంలో స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించడం అభినందనీయం అని తెలిపారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ సారథ్యంలో ఆర్.కె. ఫిల్మ్ ఫ్యాక్టరీస్ పతాకంపై రాజ్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం నువ్వేనా అది నీవేనా.

ఈ చిత్రంలో సుద్దాల అశోక్‌తేజ రచించిన జై కేసీఆర్ జై తెలంగాణ తెలంగాణ సూర్యుడు ఉద్యమాల వీరుడు అనే గీతాన్ని ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది తెలుగు చలన చిత్ర పరిశ్రమకు శుభసూచకంగా అనిపిస్తోంది. సంక్రాంతికి విడుదలైన ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్రశాతకర్ణి, శతమానంభవతితో పాటు విడుదలైన అన్ని సినిమాలు చక్కటి విజయాల్ని సాధించాయి. మంచి సినిమాలు రూపొందితే అందులో పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నువ్వేనా అది నీవేనా అలాంటి సినిమాగా నిలవాలి. అందరికి పేరు తెచ్చిపెట్టాలి. త్వరలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఓ తీపికబురు వినిపించనున్నాం. థియేటర్ల కొరత కారణంగా చిన్న నిర్మాతలు అనేక కష్టాలు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తొందరలో ఐదవ ఆటకు అనుమతులు ఇవ్వనున్నాం. అలాగే బస్టాండ్‌లలో మినీథియేటర్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. 50 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు తరలివచ్చిన సినీ పరిశ్రమను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం దాసరి నారాయణరావుతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఎనలేని కృషిచేశారు. అందరి ఆశీర్వాద బలంతో దాసరి నారాయణరావు త్వరగా కోలుకోవాలి. చిత్రపురి కాలనీలో సకల సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్‌కుమార్, మోహన్‌గౌడ్, యశోకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here