తెలంగాణలో భాగమై ఉంటే.. మాకు తిండీ, నీళ్లూ దొరికేవి

0
31

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌, ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. బుధవారం తెలంగాణ అసెంబ్లీ లాబీల్లోకి జేసీ వచ్చారు. అప్పటికే లాబీల్లో మంత్రి రాజేందర్‌ మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీగా మాట్లాడుతున్నారు. ఈటలను చూసిన వెంటనే జేసీ తనదైన శైలిలో…‘‘అబ్బో ఈటలకు ఎదురువెళ్లొద్దు. సామాన్యుడు కాదు. ఈటెలు దించుతాడు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. మంత్రి ఈటల కూడా నవ్వుతూ ఆయనకు ఎదురువెళ్లి.. అభివాదం చేయటంతోపాటు, జేసీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈక్రమంలో దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ, ‘‘తెలంగాణలో మమ్మల్ని(రాయలసీమ) కలుపుకోకుండా అన్యాయం చేశారు. అడవుల పాలు చేశారు. మరో ఐదు-పదేళ్లు మాకు కష్టాలు తప్పవు. విభజన తర్వాత మేం తెలంగాణతో కలిసి ఉంటే, తాగటానికి ఇన్ని నీళ్లు.. తినటానికి ఇంత తిండి దొరికేది. కానీ, కుదరలేదు. అప్పటి తెలంగాణ కాంగ్రెస్‌ రెడ్లే అడ్డుపడ్డారు. కర్నూలు, అనంతపురం జిల్లాల పరిస్థితి మరింత దారుణం’’ అని అన్నారు. నాటి సంగతులను ఇరువురూ గుర్తు చేసుకున్నారు.

LEAVE A REPLY