తిరుమ‌ల శ్రీవారికి పాత నోట్ల చిక్కులు

0
17

ఏడుకొండ‌ల వాడికి పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింది. కుబేరుడి బాకీ తీర్చుకో అంటూ ప‌నికిరాని పాత నోట్లు భారీ మొత్తంలో హుండీల్లో స‌మ‌ర్పించుకున్నారు కొంద‌రు భ‌క్తులు. ప్ర‌భుత్వం విధించిన డిసెంబ‌ర్ 30 డెడ్‌లైన్ త‌ర్వాత ఈ రెండు నెల‌ల్లో శ్రీవారికి రూ.4 కోట్ల విలువైన పాత 500, వెయ్యి నోట్లు రావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్రకారం డెడ్‌లైన్ త‌ర్వాత పాత నోట్లు ప‌ది కంటే ఎక్కువ ఉండ‌కూడ‌దు. దీంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈ పాత నోట్ల‌ను ఏం చేయాలో తెలియ‌క త‌ల ప‌ట్టుకుంది. ఈ నోట్ల‌ను ఏం చేయాలో చెప్పాలంటూ కేంద్ర ప్ర‌భుత్వం, ఆర్బీఐకి లేఖ రాసింది. వాళ్ల స్పంద‌న కోసం ఎదురుచూస్తున్న‌ట్లు ఓ టీటీడీ అధికారి వెల్ల‌డించారు.

డిసెంబ‌ర్ 30 డెడ్‌లైన్ త‌ర్వాత దేశం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చే భ‌క్తులు కొత్త నోట్ల‌తోపాటు పాత నోట్లను కూడా హుండీల్లో వేస్తున్నారు. ఇలా రూ.4 కోట్ల‌కుపైగా పాత నోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ ఈవో సాంబ‌శివ‌రావు వెల్ల‌డించారు. కొంద‌రు భ‌క్తులు ఇళ్ల‌లో కొద్ది కొద్దిగా డ‌బ్బు జ‌మ చేసుకొని ఒకేసారి శ్రీవారికి మొక్కులు తీర్చుకోవ‌డం సాధార‌ణ‌మే. ఇలా ఎప్ప‌టి నుంచో జ‌మైన పాత నోట్లు కూడా ఇప్పుడు హుండీల్లో చేరిపోయాయి. ఈ రెండు నెల‌ల్లో వ‌చ్చిన పాత నోట్లు ఇలా జ‌మైన‌వే కావ‌చ్చ‌ని టీటీడీ భావిస్తున్న‌ది.

LEAVE A REPLY