తల్లీబిడ్డల రక్షణకు ప్రభుత్వం పూర్తి సాయం

0
20

ప్రసవ మరణాలు తెలంగాణలో ఉండకూడదు.. తల్లీబిడ్డలు సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలి.. పేద మహిళలు అందరూ ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవించాలి.. ఇందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రసవ సమయంలో ఆర్థిక సహాయం, నవజాత శిశువులకు కేసీఆర్ కిట్స్‌తో తల్లీ బిడ్డలకు మంచి ఆరోగ్య అలవాట్లను అందించాలన్నదే తమ అభిమతమన్నారు. ఈ మేరకు రూ.12వేల ఆర్థికసహాయం, కేసీఆర్ కిట్స్, అమ్మఒడి కార్యక్రమాల అమలుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించేందుకు మహిళా అధికారులతో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీలో శాంతికుమారి, వాకాటి కరుణ, స్మితాసభర్వాల్, యోగితారాణా, ప్రియాంకవర్గీస్ సభ్యులుగా ఉంటారు. తెలంగాణలో ప్రసవ మరణాలు సున్నా శాతానికి పడిపోవాలని, భావితరం ఆరోగ్యంగా ఎదుగాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకునే పేద మహిళలకు ఇచ్చే రూ.12వేల ఆర్థిక సహాయం, పిల్లలకు ఇచ్చే కేసీఆర్ కిట్ పథకాల అమలు ఏవిధంగా ఉండాలనేదానిపై సీఎం కేసీఆర్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీనియర్ అధికారులు శాంతికుమారి, వాకాటి కరుణ, స్మితాసభర్వాల్, ప్రియాంక వర్గీస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పిల్లలకు కేసీఆర్ కిట్స్ ద్వారా అందించే మస్కిటో మెష్, సబ్బులు, షాంపూలు, పౌడర్లు, టవళ్లు, డైపర్లు తదితర వస్తువులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇప్పటికే కిట్స్ కోసం టెండర్లు పిలిచామని, మే నెల నుంచి కిట్స్ అందిస్తామని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ చెప్పారు.

LEAVE A REPLY