తమిళ నటుల వ్యక్తిగత చిత్రాలు ఆన్‌లైన్‌లో!

0
24

కొందరు తమిళనటుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేయడం సంచలనం సృష్టిస్తోంది. రేడియో జాకీ, గాయని సుచిత్ర కార్తీక్‌ ట్విటర్‌ ఖాతా ద్వారా ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. ఇందులో తమిళ నటులు ధనుష్‌, త్రిష, ఆండ్రియా, అనిరుధ్‌, హన్సిక తదితరుల ఫొటోలు ఉన్నాయి. సుచిత్ర ట్విటర్‌ ఖాతాను తొలగించినా, ఇప్పటికే అనేక మంది వాటిని రీట్వీట్‌ చేయడం, సేవ్‌ చేసి మళ్లీ అప్‌లోడ్‌ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ న్యూస్‌ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఆన్‌లైన్‌లోకి రావడానికి కారణం అదేనా?
ప్రముఖ నటుల వ్యక్తిగత ఫొటోలు అప్పుడప్పుడూ సామాజిక మాధ్యమాల్లోకి రావడం కొత్తేమీ కాదు. అయితే ప్రస్తుతం సుచిత్ర ట్విటర్‌ ద్వారా బయటకు వచ్చిన ఫొటోలు ప్రముఖ నటులవి కావడం, అందులో వారు అత్యంత సన్నిహితంగా మెలగడం గమనార్హం. నెట్‌లోకి వచ్చిన వాటిల్లో ఓ వీడియో కూడా ఉండటం చిత్ర వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓ వివాదం కారణంగానే ఈ ఫొటోలు బయటకు వచ్చాయని అంటున్నాయి సినీ వర్గాలు.

ఈ విషయంలో సుచిత్ర, ఆమె భర్త కార్తీక్‌ల వాదన మరోలా ఉంది. తన ట్విటర్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారని, వారే ఈ ఫొటోలను ఆన్‌లైన్‌లో ఉంచారని ఆమె ఆరోపిస్తున్నారు. ఫొటోలు ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత ఆమె స్పందించారు. ‘నా ట్విటర్‌ అకౌంట్‌ను మళ్లీ హ్యాక్‌ చేశారు. ఇలా జరిగినందుకు క్షమించండి. ఆ ఫొటోలను నేను పోస్ట్‌ చేశానని భావించిన వారు నా ట్విటర్‌ ఖాతాను అనుసరించవద్దు. ఇలా జరగడంతో నేను ఇప్పటికీ కోపంగా ఉన్నా. నా దగ్గర ఏ నటుల ఫొటోలూ లేవు. ఈ పని చేసిన వారు నా అకౌంట్‌ను డీయాక్టివేట్‌ చేయండి. ఆ పని నేనే చేయగలను. కానీ నన్ను ఫాలో అవుతున్న వారందరూ నన్ను ఇష్టపడి అనుసరిస్తున్నారు. నన్ను ద్వేషించే వారికి నేను చెప్పేది ఒక్కటే.. దయ చేసి నా ట్విటర్‌ ఖాతాను అనుసరించవద్దు.’

అది మంచి పద్ధతికాదు!
సుచిత్ర ట్విటర్‌ ద్వారా సినీ నటుల ఫొటోలు ఆన్‌లైన్‌లోకి రావడంతో వారి ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సుచిత్ర భర్త కార్తీక్‌ ఓ వీడియో సందేశం ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ఆ ఫొటోలను సుచిత్ర అప్‌లోడ్‌ చేశారని ఆరోపిస్తూ పలువురు అభ్యంతరకర రీతిలో పోస్టులు చేయడం మంచి పద్ధతికాదు. పరిస్థితిని అర్థం చేసుకోగలం. సహనంతో వ్యవహరించండి. ఫొటోలు వ్యక్తిగతంగా అప్‌లోడ్‌ చేసినవి కాదు’ అంటూ వివరణ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here