తప్పు చేస్తే సీఎంనైనా జనం ప్రశ్నిస్తారు

0
30

ఎవరి సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాగా తెలుసని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌గా నియమితులైన డాక్టర్‌ ఆయాచితం శ్రీధర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరిగింది. తొలుత అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలోని కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందన సభలో హోంమంత్రి మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు దూరమైతే ప¾దవులు కోల్పోతారన్నారు. తప్పు చేస్తే సీఎంను సైతం అడిగే హక్కు ప్రజలకు ఉందని స్పష్టం చేశారు. డాక్టర్‌ ఆయాచితం శ్రీధర్‌ మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వివిధ కారణాలతో తొలగించిన 300 మంది ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకునే విషయాన్ని సీఎంకు విన్నవిస్తానన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. నగర ఉప మేయర్‌ బాబాఫసీయుద్దీన్‌, గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం.బి.కృష్ణాయాదవ్‌, గ్రంథాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు దేవేందర్‌, అయోధ్య, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ముజీబ్‌, రచయితలు నందిని సిధారెడ్డి, ఆయాచితం నట్టేశ్వరశర్మ, జ్వాలా నర్సింహారావు, పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఫలువురు మంత్రులు, అధికారులు, అనధికారులు వేర్వేరుగా శ్రీధర్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here