ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్

0
15

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్, ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఉన్నారు. విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలాచారితో పాటు ఎంపీలు డాక్టర్ కేశవరావు, జితేందర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం కేసీఆర్ సహా ఎంపీలు హాజరుకానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నది.

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కూడా భేటీ అయి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉన్నది. తెలంగాణ ఏర్పడి మూడేండ్లవుతున్నా ఇంకా తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన, రెండు రాష్ర్టాల మధ్య రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాకపోవడం తదితర అంశాలను కేంద్ర హోంమంత్రి వద్ద ప్రస్తావించనున్నట్టు సమాచారం. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇటీవల రెండు రాష్ర్టాల ప్రత్యేక కమిటీలు భేటీ అయి సచివాలయ భవనాలతోపాటు తొమ్మిది, పదో షెడ్యూల్ సంస్థల విభజన అంశంపై చర్చించాయి. గవర్నర్ సమక్షంలో జరిగే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోడానికి రెండురాష్ర్టాలూ సుముఖంగా ఉన్నందున ఈ అంశాన్ని కూడా సీఎం కేసీఆర్ రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నది. వీలైతే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో కూడా భేటీ అయి రాష్ర్టానికి సంబంధించిన ఎయిమ్స్, ఐఐఎం, సిరిసిల్ల మెగా పవర్‌లూమ్ క్లస్టర్ తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తున్నది.

LEAVE A REPLY