ట్రంప్‌పై కోర్టుకెక్కిన దిగ్గజ ఐటీ కంపెనీలు

0
20

ఏడు ముస్లిం దేశాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన వివాదాస్పద ఉత్తర్వులను వ్యతిరేకించిన సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలు.. ఇప్పుడు వాటిపై న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి. ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ సహా 97 కంపెనీలు కోర్టుల్లో కేసులు దాఖలు చేసినవాటిలో ఉన్నాయి. ఈ కంపెనీలకు ట్విట్టర్, నెట్‌ఫ్లిక్స్, ఉబెర్ వంటి కంపెనీలు కూడా మద్దతు పలికాయి. ఉన్నట్టుండి ముస్లిం దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధించడంతో అమెరికాలోని కంపెనీలపై గణనీయమైన హాని కలుగుతుందని శాన్‌ఫ్రాన్సిస్కోలోని తొమ్మిదవ అప్పీళ్ల సర్క్యూట్ కోర్టుకు ఆదివారం సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నాయి. ప్రయాణాలపై విధించిన నిషేధంపై రద్దును తక్షణమే ఎత్తివేయాలని ట్రంప్ యంత్రాంగం చేసిన విజ్ఞప్తిని ఆదివారం ఇదే కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. సిలికాన్ వ్యాలీలో ఉన్న ఉద్యోగుల్లో జన్మతః విదేశీయులు దాదాపు 37శాతం మంది ఉంటారని అంచనా. ట్రంప్‌పై న్యాయపోరాటానికి దిగిన ఇతర కంపెనీల్లో ఫేస్‌బుక్, ఈబే, ఇంటెల్‌తోపాటు లెవీ స్ట్రాస్, చోబని వంటి సాంకేతికేతర కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా కోర్టుల్లో ఇప్పటికే ఆటంకాలు ఎదుర్కొంటున్న ట్రంప్ ఉత్తర్వులపై టెక్ కంపెనీలు తీసుకున్న తాజా చర్య ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here