టోక్యో నమూనా భేష్

0
16

జపాన్ రాజధాని టోక్యో నగరంలో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, నిర్వహణతోపాటు నగరం పట్ల పౌరులు బాధ్యత వహిస్తున్న తీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా నాలుగో రోజు నగరంలోని పలు అంశాలను మంత్రి కేటీఆర్ అధ్యయనం చేశారు.

టోక్యోలోని మౌలిక వసతుల పట్ల అశ్చర్యం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం కూడా ఈ స్థాయికి చేరుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టోక్యో లాంటి నగరాన్ని నడిపిస్తున్న తీరుపై మంత్రి పరిశీలన చేశారు. స్థానిక ప్రభుత్వాలు చేపడుతున్న ఘన వ్యర్థాల నిర్వహణ తీరును అధ్యయనం చేశారు. టోక్యో క్లీన్ అథారిటీ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్, అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. వాయు కాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలను టోక్యో ఎదుర్కొంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నగరంలోని వివిధ మునిసిపల్ ఏరియాల్లో చెత్తను ఎక్కడికక్కడే రీసైకిల్ చేసే ప్లాంట్లను మంత్రి పరిశీలించారు. టోక్యో మెట్రోపాలిటన్ పరిధిలో ఉన్న రెండు మునిసిపల్ నగరాల్లోని సుమారు 600 టన్నుల చెత్తను రీసైకిల్ చేసే కస్తుషిక సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. హైదరాబాద్‌లో పారిశుద్ధ్య నిర్వహణకు సాంకేతిక సాయాన్ని అందించాల్సిందిగా టోక్యో అథారిటీ అధికారులను కోరారు. తర్వాత టోక్యోలోని ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలను మంత్రి కేటీఆర్ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. గురువారం జరిగే గణతంత్ర దినోత్స వం సందర్భంగా విద్యార్థులు చేస్తున్న రిహార్సల్స్‌ను తిలకించారు. టోక్యోలాంటి అంతర్జాతీయ నగరంలో భారతదేశ జాతీయగీతాన్ని విన్నందుకు భారతీయుడిగా గర్వంగా ఉందన్నారు. పిల్లలతో కలిసి ఫొటో తీసుకున్నారు. తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY