హాకీ జూనియర్ ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ గురువారమే లఖ్‌నవూలో ఆరంభం కానుంది. తొలి రోజు భారత్.. కెనడాను ఢీకొంటుంది. దీంతో పాటు ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్-జపాన్, జర్మనీ-స్పెయిన్ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి.. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ఆడతాయి. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. పది రోజుల్లోనే ముగిసిపోయే టోర్నీలో ఫైనల్ ఈ నెల 18న జరుగుతుంది. భారత్ ఉన్న గ్రూప్-డిలోనే కెనడా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా కూడా ఉన్నాయి. తొలిసారి 2001లో జూనియర్ ప్రపంచకప్ గెలిచిన భారత్.. సొంతగడ్డపై ఈసారి ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. గగన్ అజిత్ సింగ్, దీపక్ ఠాకూర్, యుగ్రాజ్ సింగ్, ప్రభ్‌జ్యోత్ సింగ్ లాంటి ప్రతిభావంతులతో భారత జట్టు బలంగా ఉంది. జట్టులోని చాలామంది గత మూడేళ్లలో హాకీ ఇండియా లీగ్ అనుభవంతో రాటుదేలారు. కొందరు జాతీయ జట్టుకు కూడా ఆడారు. టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ, ఆస్ట్రేలియా జట్ల నుంచి భారత్‌కు సవాలు ఎదురు కావచ్చు. ఈ టోర్నీకి పాకిస్థాన్ దూరం కావడంతో ఆ జట్టు స్థానంలో మలేసియా ఆడుతోంది.