టీడీపీలో ఈ నేతలిద్దరు బద్ద శత్రువులుగా ఎందుకు మారారు..?

0
31
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఈ ఇద్దరు నేతలకు ప్రత్యేక ఇమేజ్ ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న వీరిద్దరూ ఇప్పుడు బద్ద శత్రువులుగా ఎందుకు మారారన్నదే ఈ జిల్లాలో హాట్ టాపిక్.
             ఈ ఇద్దరు నేతలకు అనంతపురం జిల్లాలోనే కాదు.. రాష్ర్టంలోనే మంచి క్రేజ్‌ ఉంది.. ఒకరేమో మంత్రి పరిటాల సునీత.. మరొకరు ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్‌ వరదాపురం సూరి.. ఇప్పుడీ ఇద్దరి నేతల ప్రస్తావన ఎందుకంటే.. ప్రస్తుతం వీరిద్దరికి అస్సలు పడటం లేదట! ఇద్దరి మధ్య ఐసు ముక్కలేసినా అంటుకునేంత రేంజ్‌లో వైరం కొనసాగుతోందట! తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లు ఇద్దరి మధ్య సత్సంబంధాలే ఉండేవని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరి ఇప్పుడెందుకు గొడవపడుతున్నట్టు అని అడిగితే పలు కారణాలు చెబుతున్నారు.. ఒకరి నియోజకవర్గంలోకి మరొకరి ప్రమేయం ఉండకూడదని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.. అయితే ధర్మవరంలో సూరికి వ్యతిరేకంగా ఉన్న ఓ నాయకుడి ఇంట్లో శుభకార్యానికి సునీత తనయుడు శ్రీరామ్‌ 50 వాహనాల్లో వెళ్లారు. దీన్ని సూరి వ్యతిరేకించారు. అక్కడ ప్రారంభమైన గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది..
            ఇద్దరి మధ్య గొడవలు అనేక సందర్భాలలో బయటపడ్డాయి కూడా! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధర్మవరానికి వచ్చినప్పుడు ఒక్క ఫ్లెక్సీపై కూడా మంత్రి సునీత ఫోటో లేకుండా చేసిందట సూరి వర్గం. ఇందులో ఎమ్మెల్యే సూరి పాత్ర ఉందనేది సునీత వర్గం ఆరోపణ.. తర్వాత జరిగిన ప్రతీ కార్యక్రమానికి సునీతమ్మకు సంబంధించిన ఫ్లెక్సీలను ధర్మవరం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేశారు ఆమె వర్గం మనుషులు.. సహజంగానే ఇది సూరి వర్గానికి కోపం తెప్పించింది.. తాజాగా ధర్మవరంలో వేస్తున్న అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్‌ లైన్‌ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరకున్నాయి.. ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు కూడా! చివరకు పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేయాల్సి వచ్చింది.. ఈ ఘటనలో సూరీ వర్గానికి చెందిన దాదాపు వంద మందికి తీవ్ర గాయాలయ్యాయి.. సునీతమ్మ వర్గీయులు కూడా గాయాలపాలయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here