టీఆర్‌ఎస్ 16వ వార్షికోత్సవానికి 15 వేల మంది ప్రతినిధులు

0
36

అంతటా పండుగ సంబురం.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) 16వ వార్షికోత్సవాలకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా శుక్రవారం (21న) హైదరాబాద్‌లో ప్రతినిధుల సభ (ప్లీనరీ), 27న వరంగల్‌లో బహిరంగసభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మరో రెండురోజుల్లో ఘనంగా జరుగనున్న ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీకి హాజరయ్యే 15వేల మంది ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని హంగులను సమకూరుస్తున్నారు. ప్లీనరీ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. ప్రతినిధులకు 26 రకాల రుచికరమైన వంటకాలతో విందు భోజనం వడ్డించనున్నారు. ప్రభుత్వం ఏర్పడి త్వరలో మూడు సంవత్సరాలు పూర్తికానున్న సందర్భంలో నిర్వహిస్తున్న ఈ ప్లీనరీకి టీఆర్‌ఎస్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. మూడేండ్లకాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి, అమలుపరుస్తున్న కార్యక్రమాలను మననం చేసుకుంటూ, రాబోయే రెండేండ్లకు ప్రణాళిక రచించేందుకు, మంచి చెడులను చర్చించుకునేందుకు ఈ ప్లీనరీని వేదికగా చేసుకోవాలని పార్టీ నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమరంగానికి ప్రభుత్వం రూ.40వేల కోట్లకుపైగా వెచ్చిస్తున్నది. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలం గా తీసుకెళ్లేలా పార్టీ క్యాడర్‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సంక్షేమ కార్యక్రమాలే కాక ప్రాజెక్టులపై ఏటా రూ.25వేల కోట్లు, మిషన్ భగీరథ స్కీంకు రూ.40వేల కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ప్రభుత్వం మూడేండ్లలో అనుసరించిన విధానాలను పార్టీ క్యాడర్‌కు కేసీఆర్ వివరించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here